ఇది ఫిక్స్‌.. ర‌జినీ సీఎం అభ్య‌ర్థి కాదు..

ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీకి సంబంధించి పూర్తి స‌మాచారం బయ‌ట‌కు ఇంకా రాలేదు. అయితే ర‌జినీకాంత్‌కు ఆయ‌న ఫ్యాన్స్‌కు మ‌ధ్య ఓ వాద‌న కొన‌సాగుతోంది. ర‌జినీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉండాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆయ‌న మాత్రం కేవ‌లం పార్టీకి మాత్ర‌మే ప‌రిమితం అవుతాన‌ని చెబుతున్నారు.

కొత్తగా రాజకీయ పార్టీ పెట్టనున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, ఈ విషయంలో ఆయన స్పష్టమైన వైఖరితోనే ఉన్నారని తమిళరువి మణియన్‌ స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా మణియన్‌ను ఇటీవల రజనీకాంత్‌ నియమించిన విషయం తెలిసిందే. ప్రజలు మాత్రం రజనీకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారని, దీనిపై సమయమొచ్చినప్పుడు పరిశీలిస్తామని ఓ ఆంగ్ల పత్రికకు మణియన్‌ చెప్పారు. పారదర్శక, అవినీతి రహిత పాలనను రజనీకాంత్‌ మాత్రమే అందించగలరని నొక్కి చెప్పారు.

పార్టీ ఏర్పాటుకు రజనీకాంత్‌పై ఎటువంటి ఒత్తిడీ లేదని, ఇచ్చిన మాట ప్రకారమే పార్టీని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కూటమి ఏర్పాటుపై ప్రశ్నించగా, ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు గురించే ఆలోచిస్తున్నారని, కూటమి గురించి తర్వాత మాట్లాడతారన్నారు. ‘ఎల్‌ఈడీ స్ర్కీన్ల ఏర్పాటు ద్వారా ఆయన సందేశాన్ని గ్రామాల్లోకి ఎలా చేర్చాలనేదానిపై నేను ఇప్పటికే చర్చించాను. ఆయన అసాధారణమైన వ్యక్తి. ఇతర రాజకీయ నాయకుల్లా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం లేదు’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here