క‌రోనా వ్యాక్సిన్ ఎలా అభివృద్ది చేస్తున్నారో తెలుసుకోనున్న ప్ర‌ధాన మంత్రి.. ఒకే రోజు మూడు న‌గ‌రాల్లో ప‌ర్య‌ట‌న‌..

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. అంద‌రూ వ్యాక్సిన్ రాక కోస‌మే ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇప్పటికే క‌రోనా వ్యాక్సిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆయా కంపెనీల సైంటిస్టులతో మాట్లాడేందుకు రెడీ అయ్యారు. రేపు ఒక్క రోజే మూడు న‌గ‌రాల్లో మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు..

మోదీ రేపు పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌ నగరాల్లో కోవిడ్-19 వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థలను ఆయన సందర్శించనున్నట్టు పీఎంఓ తెలిపింది. ‘వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను స్వయంగా సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రేపు మూడు నగరాల్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలను ఆయన సందర్శిస్తారు…’’ అని పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.

ఆయా కంపెనీలను సందర్శించి, సైంటిస్టులతో ముచ్చటించడం ద్వారా వ్యాక్సీన్ తయారీ, పంపిణీ తదితర అంశాలపై ప్రాధమిక అవగాహన తెచ్చుకునేందుకు ప్రధానికి ఈ పర్యటన తోడ్పడుతుంది. తన పౌరులకు వ్యాక్సీన్ అందించేందుకు భారత్ సిద్ధమైన వేళ.. అందుకు అవసరమైన ఏర్పాట్లు, ఎదురయ్యే సవాళ్లు, రోడ్‌ మ్యాప్ వంటి అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.

ప్రధాని మోదీ రేపు ఫార్మా దిగ్గజం జైడస్ కాండిలా ప్లాంట్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న వ్యాక్సీన్ అభివృద్ధిపై వివరాలు తెలుసుకోనున్నారని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పేర్కొన్నారు. ఉదయం 9:30 కల్లా అహ్మదాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని చంగోదార్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఈ ప్లాంట్‌కు ప్రధాని చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు. కాగా తాము తయారు చేస్తున్న జైకోవ్-డి వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్ పూర్తైందనీ.. ఆగస్టు నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని జైడస్ కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

మధ్యాహ్నం 12:30 కల్లా ప్రధాని పుణేకి చేరుకునే అవ‌కాశం ఉంది. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలైన ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలతో సీరం సంస్థ జతకట్టిన విషయం తెలిసిందే. అనంత‌రం భారత్ బయోటెక్‌ను సందర్శించేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని జినోమ్ వ్యాలీకి వెళతారని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి భారత్ బయోటెక్‌ ల్యాబ్‌లో ప్రస్తుతం కొవాక్సిన్ మూడోదశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇక్కడ దాదాపు గంటసేపు గడపనున్నారనీ.. అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here