ఆ ఇద్ద‌రి పెళ్లిని ఆపేసిన పోలీసులు..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. మ‌తాంతర వివాహాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

లక్నో నగరంలో హిందూ యువతి, ముస్లిమ్ యువకుడితో మతాంతర వివాహ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. ఓ హిందూ యువతికి, ముస్లిమ్ యువకుడితో బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహం జరగాల్సి ఉండగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని పోలీసుస్టేషనుకు తీసుకువెళ్లారు. రెండు మతాలకు చెందిన వారు ముందుగా లక్నో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి వివాహానికి అనుమతి పొందాలని పోలీసులు వధూవరుల కుటుంబాలకు సూచించారు.

ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని, దీంతో వారిని పోలీసుస్టేషనుకు పిలిచి చట్టవిరుద్ధ మార్పిడి ఆర్డినెన్సు కాపీని అందజేశామని పోలీసులు చెప్పారు. రెండుమతాల వారు పెళ్లి చేసుకునేందుకు లక్నో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని లక్నో పోలీసు అధికారి సురేష్ చంద్ర రావత్ కోరారు. రెండు వర్గాల కుటుంబాలు సమ్మతితో వివాహం చేసుకుంటున్నాయని, వారు మతం మార్చుకునే ఉద్దేశం లేదని కుటుంబాలు చెపుతున్నాయి.

బలవంతంగా మత ప్రయోజనం కోసం మతమార్పిడులు జరిగేలా వివాహాలు చేసుకోవడం చట్టవిరుద్ధమని మతమార్పిడి నిషేధ ఆర్డినెన్సు చెబుతోంది. వివాహం తర్వాత మతం మార్చుకోవాలని యోచిస్తున్న వారు తమ ఉద్ధేశాన్ని కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మెజిస్ట్రేటుకు తెలియజేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. వివాహం కోసం మతం మార్చే వ్యక్తిని అరెస్టు చేసి బెయిలు కూడా ఇవ్వరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here