ఆ రాష్ట్రంలో యువ‌త‌కు మోటార్ సైకిళ్లు ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం..

ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వాలు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుంటాయి. పిల్ల‌లు పాఠ‌శాల‌ల‌కు వెళ్లేందుకు ప‌లు రాష్ట్రాల‌లో ఆక‌ర్షించే ప‌థ‌కాలు ఉంటాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూల్‌కు వెళ్లే పిల్ల‌ల కోసం అమ్మ ఒడి ప‌థ‌కం తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌తి త‌ల్లి అకౌంట్లో రూ. 15 వేలు ప్ర‌భుత్వం వేస్తుంది.

ఇప్పుడు యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఓ వినూత్న‌మైన కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. యువతలో ఆత్మస్థయిర్యం నింపేందుకు బెంగాల్ ప్రభుత్వం కర్మ్ సాథీ స్కీం ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని రెండు లక్షల మంది యువతకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే యువతను వ్యవసాయం చేపట్టేదిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం మమతా బెనర్జీ ఈ పథకం కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు.

వీరిలో 2 లక్షల మంది యువతకు మోటారు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మోటారు సైకిళ్లకు వెనుక భాగంలో ప్రత్యేకమైన బాక్సులను అమర్చనున్నారు. లబ్ధిదారులు ఆ బాక్సులలో తాము విక్రయించాలనుకుంటున్న పండ్లు, కూరగాయలు, దుస్తులు లేదా ఇతర సామగ్రిని ఉంచుకుని విక్రయాలు సాగించవచ్చు. తద్వారా యువత తాము పండించిన పంటను పట్టణాలలో విక్రయించవచ్చు. అలాగే పట్టణాలలో దొరికే వస్తువులను గ్రామాలకు తీసుకువచ్చి విక్రయించవచ్చు. ఈ విధమైన విధానం వలన యువతకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం యువతకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కూడా కల్పించనుంది. ఈ ప‌థ‌కం ఇత‌ర రాష్ట్రాల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here