స్టేడియాల‌ను జైళ్లుగా మార్చుకుంటామంటే ప్ర‌భుత్వం నో చెప్పింది.. ఎక్క‌డో తెలుసా..

కేంద్ర ప్ర‌భుత్వంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఢిల్లీలో ధ‌ర్నాకు వెళ్లిన రైతులు ఎట్ట‌కేల‌కు ఢిల్లీలోప‌లికి వెళ్లారు. వీరిని పోలీసులు అనుమ‌తించారు. పోలీసుల ప‌హారాలోనే రైతులు న‌గ‌రంలోనికి వెళ్లారు. అయితే అంత‌కుముందు రాం లీలా మైదానంలోకి అనుమ‌తి ఇవ్వాల‌ని రైతులు మోదీకి బ‌హిరంగ లేఖ రాశారు.

ఇదిలా ఉంటే నగరంలోని 9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌లో భాగంగా రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పంజాబ్, హర్యానా రైతులను అదుపులోకి తీసుకుని స్టేడియాలకు తరలించి నిర్బంధించాలని భావించిన పోలీసులు ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరారు. అయితే, వారి అభ్యర్థనను ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

రైతుల డిమాండ్ న్యాయమైనదేనని, వారిని జైళ్లలో పెట్టడం సమస్యకు పరిష్కారం కాబోదని, వారి డిమాండ్లు అంగీకారయోగ్యమైనవని ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఢిల్లీలో నిరసన తెలిపేందుకు రైతులకు అనుమతి లభించింది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగమ మైదానంలో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి త‌ర‌లివ‌చ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here