ప్ర‌ధాని మోదీపై మాట‌ల దాడి చేసిన ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి..

కేంద్ర ప్ర‌భుత్వానికి, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇది ఇటీవ‌ల మ‌రీ ఎక్కువైంది. రానున్న కొద్ది నెల‌ల్లో బెంగాల్‌లో ఎన్నిక‌లు రానున్న విష‌యం తెలిసిందే. దీంతో అధికార తృణ‌ముల్ కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌ధ్య ఇంకా మాట‌ల యుద్దం ఎక్కువైంది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సుప్రీం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి బదులు అర్ధ సత్యాలు, వాస్తవాల వక్రీకరణతో రైతులను ప్రధాని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తూ, రాజకీయ ప్రయోజానల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. కొత్త రైతు చట్టాలతో ఎంఎస్‌పీ, రాష్ట్ర సేకరణ వ్యవస్థ నీరుగారిపోతుందని, ప్రైవేటు కొనుగోలుదారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మమత చెప్పారు.

సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధాని టీవీ ఈవెంట్‌లకే పరిమితమవుతున్నారంటూ మమత తప్పుపట్టారు. రూ.8,000 కోట్ల జీఎస్‌టీ బకాయిలతో పాటు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి రూ.85,000 కోట్ల మేరకు కేంద్రం బకాయి పడిందని, పశ్చిమబెంగాల్ పట్ల నిజంగానే ప్రేమ ఉంటే అందులో కొంత మొత్తమైనా తక్షణం విడుదల చేయాలని మమత డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ యోజన అమలులో బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ కేంద్రం చేసిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పీఎం కిసాన్ యోజన గురించి తాను రెండు లేఖలు రాశానని, సంబంధిత మంత్రితో కూడా మాట్లాడానని, అయితే వారి నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here