అవినీతి బ‌రిలో బ‌రితెగిస్తున్న తెలుగు త‌మ్ముళ్లు

టిడిపి అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, పార్టీ అధిష్టానం అంటే ఒక నమ్మకం, ఇంకొంచెం భయం, గీత దాటని కట్టుబాటు….ఇదంతా ఆ పార్టీలో గత వైభవమే అన్నట్లు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. అవును, ఇటీవల పార్టీ నేతలు అనుసరిస్తోన్న వైఖరి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి బరిలో బరితెగించి దూసుకుపోతుంటే కట్టడి చేయాల్సిన అధిష్టానం కామెంట్లతోనే సరిపెట్టేస్తోంది. దీంతో గట్టు తెగిన గోదారిలా పార్టీలో అవినీతి ప్రవాహం పార్టీ పరువు , ప్రతిష్టలను బంగాళాఖాతం వరకూ తీసుకుపోతోంది. ఇందుకు మరో తాజా ఉదాహరణ దీపక్ రెడ్డి భూ కబ్జా వ్యవహారం. ఇవే కాదు మొన్నటి ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి వ్యవహారం, నిన్నటి వైజాగ్ లో పార్టీ పెద్దలతో సంబంధాలున్నట్లు చెబుతున్న భూకుంభకోణం పార్టీని అప్రతిష్టపాలు చేసేలా ఉన్నాయి.

మైకు పట్టిన ప్రతీసారి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామనీ, 1100 కాల్ సెంటర్ తో 500, 1000 రూపాయల లంచాల్ని కూడా ప్రజలకు వెనక్కి ఇప్పిస్తున్నామని ఢాంబికాలు పలుకుతోన్న ప్రభుత్వ పెద్దలు, పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి వైరస్ ను పట్టించుకోవటమే మానేశారు. ఏ రకమైనా అవినీతి అయినా ఒకటే, అది ఉద్యోగుల అవినీతి అయినా, రాజకీయ అవినీతి అయినా లేక మరేదైనా ఒకటేనని ఇటీవలే మీడియా ముందు ప్రకటించిన చంద్రబాబు, దాని ఆచరణ మాత్రం మరచినట్లున్నారు. దాని ఫలితమే పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు కారణంగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా దీపక్ రెడ్డి వ్యవహారంలో పార్టీ స్పందన  ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మియాపూర్ భూ కుంభకోణంపై పోరాడతామని తెలంగాణ టీడీపీ నేతలు ఉద్యమానికి సిద్ధమవుతుంటే అదే పార్టీకి చెందిన ఏపీ ఎమ్మెల్సీ భూ కుంభకోణంలోనే అడ్డంగా దొరికి పోవడం పార్టీని కలవర పాటుకు గురిచేస్తోంది.

ఇక పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై ఏకంగా సీబీఐ దాడులు జరగటం ఏపీలో సంచలనం సృష్టించింది. అటు కేంద్రంలో కూడా దీనిపై చర్చ జరిగింది… అయితే ఇంతటి చర్చ జరగటంతో పార్టీ నుండి వాకాటి నారాయణ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ చుట్టూ ముసురుకొస్తోన్న ప్రమాదాల్ని గ్రహించలేకపోతున్నారు.

వైజాగ్ లో వందల ఎకరాల భూకుంభకోణం బయటపడింది. అధికారులు పాత్రధారులుగా, అధికారపార్టీ నేతలు సూత్రధారులుగా చేసిన ఈ కుంభకోణాల విలువ వేలాదికోట్లని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. అంతేనా ఈ కుంభకోణాల వెనుక మరో అడుగు ముందుకేసి మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ల పాత్ర ఉందని బలంగా వాదిస్తోంది….ఈ గొడవ ఇంకా కొలిక్కి రాకముందే ఇప్పుడు హైదరాబాద్ లో మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యవహారం పార్టీకి పెద్ద మరకంటించింది. స్థానిక అధికారులు, అడ్వకేట్లతో కుమ్మక్కయి తప్పుడు డాక్కుమెంట్లతో వందల ఎకరాలను అమ్మేశారన్న ఆరోపణలతో ఇప్పుడు పార్టీ నేత పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఊచలు లెక్కలు పెడుతున్నారు….

ఇదంతా జరుగుతుంటే , ప్రతిపక్షాలు మరోవైపు ఆరోపణలు సంధిస్తోంటే సీఎం చంద్రబాబు మాత్రం వీటిని చూసీచూడనట్లు వ్యవహరించటం సరికాదన్న అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు జండా పట్టుకుని అప్పటి అధికార కాంగ్రెస్ తో పోరాడి పోలీసుల దెబ్బలు తిన్న తమకు సరైన ప్రాధాన్యత తగ్గటం లేదని బాధపడుతున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఏ మాత్రం  జీర్ణించుకోలేకపోతున్నారు. నాకూ ఇంటలిజెన్స్ ఉంది, నాకూ సీఐడి ఉందని ధీమాగా చెప్పే చంద్రబాబుకు పార్టీలో ఏం జరుగుతోంది, కుంభకోణాల్లో ఎవరిపాత్ర ఉంది..? వీటన్నిటిపైనా ప్రజలేమనుకుంటున్నారన్నదానిపై ఆయన నమ్ముకున్న ఇంటలిజెన్స్ వాస్తవాలు ఎందుకు చెప్పలేకపోతుందో ఆయనకే తెలియాలంటున్నారు మరికొందరు సీనియర్లు….ఏదేమైనా ప్రస్తుతం రాష్ట్రంలో వివాదాలకు కేంద్రబిందువులుగా పార్టీనేతలు తయారవుతున్న తరుణంలో సరైన చర్యలు ఇకనైనా చేపట్టకపోతే పుట్టి మునగటం ఖాయమని వారు నమ్ముతున్నారు. మరి బాబుగారు డ్యామేజీ కంట్రోలింగ్ కోసం మీరు ఏవిధంగా ముందుకెళ్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here