బాబు క‌న్నేస్తే…త‌మిళ స‌ర్కారు ప‌డిపోతుంద‌ట‌

త‌మిళ‌నాడు స‌ర్కారులో కొత్త వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆ వివాదం కొత్త‌రూపం దాల్చితే ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని పేర్కొంటూ ఆ చ‌ర్చ‌ల్లో ఆస‌క్తిక‌రంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పేరు వినిపిస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే…ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నట్లుగా తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌లో బాబు ఎంట‌ర్ అయితే గ‌నుక స‌ర్కారు కూలిపోతుందంటున్నారు.
త‌మిళ‌నాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ గిండి, మాధవరంలోని ప్రభుత్వం పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని ర‌కాల మిశ్ర‌మాల‌తో పాల‌ను క‌ల్తీ చేస్తున్న‌ట్లు గుర్తించిన‌ట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పాలలో రసాయనాలు కలుపుతున్నారని, ఆ పాలు తమిళనాడు ప్రజలు ఉపయోగించరాదని సూచించారు. ప్రైవేట్ పాలలో రసాయనాలు కలిపారని తాను నిరూపిస్తానని, లేదంటే తన పదవికి రాజీనామా చేసి ఉరి కంబంలో వేలాడటానికి సిద్దంగా ఉన్నానని రాజేంద్ర బాలాజీ సవాలు చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి రాజేంద్ర చేసిన ఈ వ్యాఖ్య‌లు త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేకెత్తించాయి. ఇటు పాల వ్యాపారులు మొద‌లుకొని రాజ‌కీయ వ‌ర్గాలు సైతం స్పందించాయి. త‌మిళ‌నాడులోని ప్రైవేట్ వ్యాపారులు సంస్థ‌ల ప్ర‌తినిధులు స్పందిస్తూ మంత్రి వ్యాఖ్య‌లు స‌రికాద‌ని, ప్రైవేట్ పాలల్లో రసాయనాలు కలుపుతుంటే ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారని బహిరంగంగా ప్రశ్నించారు. త‌మ వ్యాపారంపై దెబ్బ‌కొట్టే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష‌నేతలైన స్టాలిన్‌, విజ‌య్‌కాంత్ మాట్లాడుతూ మంత్రి తీరును త‌ప్పుప‌ట్టారు. ప్రైవేట్ పాల కంపెనీల నుంచి మ‌మూళ్లు రాక‌పోవ‌డం వ్ల‌లే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లున్నార‌ని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడే మాట‌లు ఎందుకు మాట్లాడుతున్నార‌ని విజ‌య్ కాంత్ ప్ర‌శ్నించారు.
కాగా ఈ వ్యాఖ్య‌ల‌పై సీఎం ప‌ళ‌నిస్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. అన‌వ‌స‌ర వివాదాల్లో త‌ల‌దూర్చవ‌ద్ద‌ని హెచ్చ‌రించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. త‌మిళ‌నాడులోని ప్రైవేట్ వ్యాపారుల్లో మెజార్టీ తెలుగువారు ఉన్నార‌ని, వారు ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఈ విష‌యం తెలిపి ఆయ‌న ఎంట్రీ ఇస్తే సీన్ మారిపోతుంద‌ని ప‌ళ‌నిస్వామి అన్న‌ట్లుగా మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. బాబుతో కేంద్ర ప్ర‌భుత్వానికి ఉన్న సంబంధాల రీత్యా కేంద్ర ప్ర‌భుత్వం ఎంట్రీ ఇస్తే మ‌ద్ద‌తిస్తున్న ఎమ్మెల్యేల్లోని ప‌లువురు బ‌య‌ట‌కు త‌మ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకునే ప్ర‌మాదం ఉంద‌ని వ్యాఖ్యానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here