వెంక‌య్య‌కు ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి టీడీపీకి ఇష్టం లేద‌ట‌!

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడును ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలోకి దింపేందుకు ఆ పార్టీ క‌స‌ర‌త్తు చేస్తోంద‌న్న వార్త‌లు రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. విప‌క్ష యూపీఏ కూట‌మికి మెజారిటీ ఉన్న రాజ్య‌స‌భ‌లో అధికార ప‌క్షంగా త‌న మాట నెగ్గించుకునేందుకు, స‌భ‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు వెంక‌య్య అయితే బాగుంటుంద‌ని, అంతేకాకుండా రాజ్యాంగ విధివిధానాలు, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం ప‌నిచేసిన వెంక‌య్య అయితే స‌భ‌ను బాగా న‌డుపుతార‌న్న రెండు కార‌ణాల‌ను ప్ర‌స్తావిస్తున్న బీజేపీ అధిష్ఠానం… ఈ దిశ‌గా యోచిస్తోంది. తెలుగు నేల‌కు చెందిన వెంక‌య్య‌కు రాష్ట్రప‌తి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న వార్త‌ల‌తో గ‌తంలో తెలుగు ప్ర‌జ‌లంతా చాలా సంతోషించారు. వెంక‌య్య‌ను రాష్ట్రప‌తిగా చూస్తామంటూ ప్ర‌జ‌లంతా ఆస‌క్తిగానూ గ‌మ‌నించారు.
అయితే త‌న‌కు రాష్ట్రప‌తి ప‌ద‌వి మీద అంత‌గా ఇష్టం లేద‌ని, తాను ఉషాప‌తిగానే ఉంటాన‌ని, రాష్ట్రప‌తిగా మాత్రం ఉండ‌లేన‌ని కూడా ఆయ‌న త‌న భార్య ఉషా పేరును ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తిక‌ర వాద‌న వినిపించారు. ర‌బ్బ‌ర్ స్టాంపు లాంటి రాష్ట్రప‌తి ప‌ద‌విలో ఉండి ఏం చేసేద‌న్న కోణంలోనే వెంక‌య్య నాడు ఆ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే రాష్ట్రప‌తి అభ్యర్థిగా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసిన బీజేపీ అధిష్ఠానం… వెంక‌య్య‌కు ఇష్టం లేని రాష్ట్రప‌తి ప‌ద‌విని ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. ఇక‌పోతే… ఇప్పుడు అంతా ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌కుండానే తాము ప్ర‌తిపాదించే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిస్తామంటూ సంత‌కాలు చేయండంటూ బీజేపీ… ఎన్డీఏలోని మిత్ర‌ప‌క్షాల‌పై వ‌త్తిడి చేస్తోంది.
అయితే ఈ దిశ‌గా బీజేపీ నుంచి ఇంకా స్ప‌ష్ట‌త రాకున్నా… ఆ పార్టీ మిత్ర‌ప‌క్షం, ఏపీలో అధికార ప‌క్షంగా ఉన్న టీడీపీ మాత్రం తెగ ఆందోళ‌న చెందుతోంది. ఎందుకంటే… వెంక‌య్యను ఉప‌రాష్ట్రప‌తిగా చూసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం గానీ, పార్టీ నేత‌లు గానీ ఏమాత్రం సిద్ధంగా లేరు. అదేంటీ… రాజ్యాంగ ప‌ద‌వి అయిన ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి అంటే వెంక‌య్య‌కు మ‌రింత గౌర‌వం ద‌క్కిన‌ట్లే క‌దా… మ‌రి త‌మ‌కు ఇష్ట‌మైన వెంక‌య్య‌కు ఆ ప‌ద‌వి వ‌స్తుందంటే సంతోషించాల్సింది పోయి ఆందోళ‌న చెంద‌డం ఎందుక‌నేగా మీ డౌటు. దీనికీ కార‌ణాలున్నాయట‌. ఆ కార‌ణాల వివ‌రాల్లోకి వెళితే… బీజేపీ అధిష్ఠానంతో టీడీపీకి అంద‌రూ అనుకున్నంత సాన్నిహిత్యం లేదు. అయితే తామంటే అమిత ఇష్ట‌ప‌డే వెంక‌య్య ఉండ‌టం వ‌ల్లే బీజేపీలో త‌మ‌కు ఆ మాత్రం మ‌ర్యాద ద‌క్కుతుంద‌న్న‌ది టీడీపీ నేత‌ల వాద‌న‌. జ‌న‌మంతా కూడా ఈ వాద‌న‌ను నిజ‌మ‌నే అనుకుంటారు. ఎందుకంటే… ఆ రెండు పార్టీల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే… ఈ విష‌యం ఎవ‌రికైనా తేట‌తెల్ల‌మైపోతుంది.
అయితే ఈ వాద‌నను అంత‌గా ప్ర‌చారం చేయ‌ని టీడీపీ నేత‌లు మ‌రో ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపిస్తున్నారు. వెంక‌య్య కార‌ణంగానే న‌వ్యాంధ్ర‌కు కేంద్రం నుంచి ఆశించిన దానికంటే కూడా అధిక ప్ర‌యోజ‌నాలు ద‌క్కుతున్నాయ‌ట‌. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆర్థిక లోటులో కూరుకుపోయిన ఏపీకి… వెంక‌య్య మంత్రాంగం కార‌ణంగానే కేంద్రం ఆప‌న్న హ‌స్తం అందించింద‌ట‌. ఈ త‌ర‌హా సాయం భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగాలంటే… వెంక‌య్య యాక్టివ్ పాలిటిక్స్‌లోనే ఉండాల‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. అదే బీజేపీ అధిష్ఠానం భావిస్తున్న‌ట్లుగా వెంక‌య్య ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నికైతే… కేంద్రాన్ని ఒప్పించి ఏపీకి ఏమీ ఇప్పించే స్థితిలో ఉండ‌ర‌ట‌.
ఎందుకంటే… ఉప‌రాష్ట్రప‌తిగా ఉన్న వ్య‌క్తి పార్టీల‌కు అతీతంగా, రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాలి క‌దా. మ‌రి అలాంటి ప‌ద‌విలోకి వెంక‌య్య మారిపోతే… కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన అన్ని ర‌కాల సాయాల‌ను ఎవ‌రు ఇప్పిస్తార‌న్న‌ది టీడీపీ నేత‌ల ప్ర‌శ్న‌. ఇదంతా బాగానే ఉంది కానీ… ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెంక‌య్య ఏమీ చేయ‌లేని వైనంపై జ‌నం అడిగే ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ నేత‌లు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here