సునీల్ కి ఇక తిరుగు లేనట్టే .. సూపర్ క్యారెక్టర్ పడింది

హీరోగా వ‌రుస ప‌రాజ‌యాల్ని చ‌వి చూస్తున్నాడు సునీల్‌. `హీరోయిజం వ‌దిలేసి హాయిగా క‌మెడియ‌న్‌గా సినిమాలు చేసుకోవ‌చ్చు క‌దా` అనే స‌ల‌హాలూ ఎక్కువయ్యాయి. సునీల్ కూడా అలాంటి మంచి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నాడు. హీరోయిజం రుచి మ‌రిగి మ‌ళ్లీ కామెడీ వైపు మ‌ళ్ల‌డం క‌ష్ట‌మే.

మంచి బ్యాన‌ర్‌, మంచి ద‌ర్శ‌కుడు, స్టార్ హీరో సినిమా అయితే క‌ళ్లు మూసుకుని చేసేయొచ్చు. ఆ అవ‌కాశం ఖైది నెం.150 తో వ‌చ్చింది కూడా. కానీ కాల్షీట్ల స‌మ‌స్య‌తో ఆ సినిమా వ‌దులుకోవాల్సివ‌చ్చింది. అయితే ఇప్పుడు `సైరా`కి మాత్రం సై అన్నాడు. ఆ సినిమాలో సునీల్ పాత్రేమిటో తెలీదు గానీ.. ఇప్పుడు మ‌రో సినిమాలో ఓ సూప‌ర్ క్యారెక్ట‌ర్ ప‌ట్టేశాడు సునీల్‌.

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఇందులో సునీల్‌కి ఓ మంచి క్యారెక్ట‌ర్ దొరికింద‌ని టాక్‌. హీరో త‌ర‌వాత‌… అంత‌టి కీల‌క‌మైన పాత్ర‌లో సునీల్ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం.

సునీల్ – త్రివిక్ర‌మ్‌ల మైత్రి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది? సునీల్ స్టార్ క‌మెడియ‌న్‌గా మారాడంటే దానికి స‌గం కార‌ణం త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగులే. ఇప్పుడు మ‌రోసారి సునీల్ కోసం సూప‌ర్ కామిక్ రోల్ డిజైన్ చేశాడ‌ని స‌మాచారం. సునీల్ కూడా హీరో నుంచి మ‌ళ్లీ కామెడీ పాత్ర‌ల వైపు యూట‌ర్న్ తీసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here