రేవంత్ టీడీపీపై దుమ్మెత్తిపోయడమే తరువాయి

టీడీపీని వీడిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖను సమర్పించడంతో రేవంత్ ఉద్దేశాలు, రాజకీయ భవిష్యత్ కోసం వేసుకున్న దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మరోవైపు టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్న తరుణంలోనే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా హైదరాబాద్ వస్తూండడం.. ఆ పార్టీలో తదుపరి పరిణామాలను సూచిస్తోంది.
 టీడీపీలో సంచలనాలకు, అనుమానాలకు తెరదించిన రేవంత్… కాంగ్రెస్ లో భవితవ్యం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
చంద్రబాబుతో భేటీకి ముందు నేరుగా తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించని రేవంత్.. చాలా వ్యూహాత్మకంగానే డ్రామా నడిపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో కుంతియాతో పాటు రాహుల్ ను కలిసిన రేవంత్… టీడీపీని ఓ కుదుపు కుదిపారు. ఆ పార్టీ నేతలందరినీ అనుమానంలోకి నెట్టేశారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడి.. టీడీపీ పైనా, పార్టీ నేతల పైనా చెలరేగిపోయారు. ఆ విమర్శలు భరించలేక పార్టీయే తనను సస్పెండ్ చేయాలని రేవంత్ ఎదురుచూసి ఉంటారు.
అయితే చంద్రబాబు చాణక్యం మేరకు కథ నడిపించిన అధ్యక్షుడు ఎల్.రమణ.. ఇతర సీనియర్లయిన మోత్కుపల్లి నరసింహులు వంటివారు… వ్యూహాత్మకంగా రేవంత్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారు. ఇక చంద్రబాబు రాగానే అన్నీ చెబుతానని విలేకరులకు ముందే చెప్పినప్పటికీ చంద్రబాబు కూడా ఆ అవకాశం రేవంత్ కు ఇవ్వకపోవడం విశేషం. అక్కడ అమరావతిలో కూడా రేవంత్ భేటీని వాయిదా వేయడంతో రేవంత్ ఫీలైపోయారు. ఇన్నాళ్లూ పనిచేసిన పార్టీలో ఆఖరుసారిగా అధినేత దగ్గర ఎదురైన అనుభవంతో రేవంత్ అవమానపడ్డారు. ఇక వెయిట్ చేయలేక అక్కడికక్కడే రాజీనామా లేఖను ఇచ్చేసి రేవంత్ వెనుదిరగాల్సి వచ్చింది.
 ఇక చంద్రబాబుతో రేవంత్ భేటీ అయితే కొన్ని కీలకమైన అంశాలైనా చర్చకు వచ్చేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పొత్తుపై మనసు విప్పి మాట్లుడుకునే అవకాశం చిక్కేదని, భేషజాల్లేకుండా వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకొని అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం ఎంచుకునే వీలుండేదన్న వ్యాఖ్యానాలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేదైనా తన అభిమతానికి సరిపోదని రేవంత్ భావించడం వల్లే టీ-టీడీపీ నేతల సమావేశానికి రేవంత్ ఎగనామం పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్కడ వెల్లడయ్యే అభిప్రాయాలతో తాను కూడా నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితులు రావచ్చేమోనని ఊహించిన రేవంత్.. అందుకే డుమ్మా కొట్టాడంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేకపోతే.. అడ్రస్ గల్లంతవుతుందని సీనియర్లు భావిస్తున్నారు. అది సుతరామూ ఇష్టం లేని రేవంత్… అసలా చర్చ తన సమక్షంలో జరక్కముందే రాజీనామా చేసేస్తే.. ఓ పనైపోతుందని భావించారు. అంతేకాదు.. చాలా ముందుచూపుతో.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ తన తిరుగులేని నైజాన్ని ప్రదర్శించారు.
గతంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినప్పుడు… పార్టీకీ, ఎమ్మెల్యే పదవులకూ రాజీనామా చేయాలని రేవంతే డిమాండ్ చేశారు. ఇప్పుడు తానే ఆ డిమాండ్ ను ఫాలో కాకపోతే ఎదురుదాడి తప్పదని భావించిన.. రేవంత్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. దీంతో ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టయింది.
ఇక ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన రేవంత్.. రేపోమాపో కాంగ్రెస్ లో చేరిపోవడం ఖాయంగా మారింది. మరి కాంగ్రెస్ లో చేరాక టీడీపీని తిట్టకుండా రేవంత్ ఉండగలరా? చంద్రబాబును విమర్శించకుండా ఉండగలరా? అలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు, తనకున్న సహజమైన ధోరణిలో ఇతర కాంగ్రెస్ నేతలకన్నా ఎక్కువగా విమర్శించే అవకాశాలను పెంచుకోగలిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే.. ఇకనుంచి రేవంత్ టీఆర్ఎస్ తో సమానంగా కాకపోయినా.. కాస్త తక్కువ సమానంగానైనా టీడీపీని కూడా తిడతారన్నమాట. రానున్న రోజుల్లో తెలుగు రాజకీయాలు మరింత హాట్ గా మారే అవకాశాలు రేవంత్ రాజకీయ నిర్ణయంలో ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here