ఆ మధుర గానం మూగబోయింది..

కోట్లాదిమంది అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చివరి క్షణం వరకు బాలసుబ్రహ్మణ్యం కోలుకొని మళ్లీ మామూలు మనుషిగా మారతారని ఆశించిన అభిమానుల కోరిక నెరవేరలేదు. గత నలభై రోజులుగా కరోనాతో పోరాడిన బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. తన మధుర గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలసుబ్రమణ్యం ఇక లేరనే వార్త.. యావత్ సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

బాలు పూర్తి పేరు పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేట‌మ్మ‌పేట‌లో జ‌న్మించారు. తండ్రి సాంబ‌మూర్తి, తల్లి శంకుత‌ల‌మ్మ‌. తండ్రి హ‌రి క‌థా క‌ళాకారుడు. తండ్రిని చూస్తూ బాలు కూడా పాడ‌డం మొద‌లెట్టారు. ఇంజ‌నీరింగ్ చ‌దువుతూ పాట‌లు పాడడం మొద‌లెట్టారు. 1966లో `మ‌ర్యాద‌రామన్న‌` సినిమాతో తొలిసారి గాయ‌కుడిగా పరిచయం అయ్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న వెను దిరిగి చూసుకునే అవ‌కాశ‌మే రాలేదు. క‌థానాయ‌కుడి శైలిని, గొంతునీ అనుస‌రిస్తూ పాట‌లు పాడ‌డం బాలు ప్ర‌త్యేక‌త‌. కృష్ణ‌, అక్కినేని, చిరంజీవి, బాల‌కృష్ణ‌ ఎవ‌రికి పాట పాడుతున్నారో గ్ర‌హించి దానికి త‌గ్గ‌ట్టు త‌న గొంతు మార్చుకునేవారు.

బాలుకి నటించటం మంచి హాబీ. చాలా చిత్రాల్లో నటించారు. డ‌బ్బింగ్ క‌ళాకారుడిగానూ బాలు ఖ్యాతి గ‌డించారు. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ ల‌కు గాత్ర‌దానం చేశారు. దాదాపు 40 చిత్రాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోదండ‌పాణి కి గురు స్థానం ఇచ్చారు బాలు. అందుకే త‌న ఆడియో ల్యాబ్‌కి `కోదండ‌పాణి ఆడియో ల్యాబ్‌` అని పేరు పెట్టుకున్నారు. బాలు అర్థాంగి సావిత్రి. వీరిద్ద‌రికీ ఇద్ద‌రు పిల్ల‌లు. అందులో ఎస్‌.పి.చ‌ర‌ణ్ గాయ‌కుడిగా, నిర్మాత‌గా చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here