అశ్రు నయనాల నడుమ అంతిమ సంస్కారం..

తన అద్భుత గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాయకుడు బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన బాలు గత 40 రోజులుగా చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. బాలు పార్ధీవ దేహాన్ని శుక్రవారం రాత్రే.. చెన్నైలోని తామరైపాక్కంలోని ఆయన ఫామ్‌ హౌజ్‌కు తరలించారు. అశేషమైన అభిమానుల నడుమ బాలు అంతిమ సంస్కారాలు కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. కరోనా కారణంగా కొవిడ్‌ నిబంధలు ఉండడంతో కొందరు సినీ ప్రముఖలు హాజరు కాలేకపోయారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న బాలు ఆప్త మిత్రులు, ఆయన చూపిన దారిలో నడిచి గొప్ప స్థానంలో ఉన్న యువ గాయకులు బాలు చివరి చూపును నోచుకోలేకపోయారు. అయితే సోషల్‌ మీడియా వేదికగా తమ ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. బాలు మరణంపై స్పందించిన కొందరు సెలబ్రిటీలు ఏమన్నారంటే..

అలీ..

ఒక అద్భుతమైన లెజెండ్‌ని సినీ ఇండస్ట్రీ కోల్పోయింది. భగవంతుడే ఆయనను పిలిపించుకున్నారేమో.. ఇక్కడ ఎవరూ లేరని బాలు గారిని తీసుకుపోయాడేమో. బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

మహేష్‌ బాబు..

బాలు గారు లేరనే మాటను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయనలాంటి గొంతు మరెవరికీ ఉండదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటుంన్నాను. బాలు గారి కుటుంబానికి నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను.

జూనియర్‌ ఎన్టీఆర్‌..

తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకుపైగా 16 భాషల్లో 40 వేలకుపైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇకలేరనే వార్త తీవ్రంగా కలిచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంతకాలం మీరు అమరులే.

పవన్‌ కళ్యాణ్‌..

బాలు గారి మరణం నన్ను ఎంతగానో కలిచివేసింది. బాలు గారు నా సినిమాలకు కూడా చాలా పాటలు పాడారు. కరోనా బారినపడిన తర్వాత ఆయన క్రమేణా కోలుకుంటున్నారని తెలియడంతో ఎంతో ఆనందించాను. కానీ ఇలా జరగడం దారుణం. ఎంతోమంది అభిమానులు బాలు గారు కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కానీ ఇలా జరగడం చాలా బాధాకరం. బాలు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

చిరంజీవి..

బాలు గారి విషయంలో ఏ వార్త అయితే వినకూడదనుకున్నామో ఆ వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన్ని కోల్పోవటం చాలా దురదృష్టం. భారతీయ సంగీత ప్రపంచానికి ఇది ఒక దుర్దినం. చాలా బాధగా అనిపిస్తుంది. గుండె తరుక్కుపోతుంది. నాకు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు..  నేను అన్నయ్య అని పిలిచే నా కుటుంబసభ్యున్ని పోగొట్టుకున్న భావం నాకుకలుగుతుంది. నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు.

రాజమౌళి..

బాలుగారు పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతున్నాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వారంటే ఒప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషల్లోనూ పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం.

వీరితో పాటు ఏ.ఆర్ రెహమాన్‌, హరిహరన్‌, మోహన్‌ లాల్‌, అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్‌, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, రవితేజ, నిఖిల్‌, రామోజీ రావు, విజయశాంత, రామ్‌, ఆర్‌. మాధవన్‌, జగపతి బాబు, అల్లరి నరేష్‌, శర్వానంద్‌, గుణశేఖర్, అజయ్ దేవ్‌గన్, సల్మాన్ ఖాన్, బోని కపూర్, కొరటాల శివ, సుమన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, శంకర్, లింగుస్వామి, జిబ్రాన్, థమన్, దేవిశ్రీప్రసాద్, మారుతి తదితరులు బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంతాపం తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here