వెండి తెరపై మరోసారి ‘సిల్క్’ కథ..

తన గ్లామర్, అద్భుత నటనతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి సిల్క్ స్మిత. గ్లామర్ రోల్స్‌లో నటించిన సిల్క్… యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీకి సుపరిచితం. కెరీర్‌లో టాప్ స్పీడులో దూసుకెళ్తున్న సమయంలోనే అనుకోని పరిస్థితుల్లో చిన్న వయసులోనే సిల్క్ స్మిత మరణం అప్పట్లో సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సిల్క్ స్మిత జీవిత కథ..  ఏ సినిమా కథకు తీసిపోదు. ఈ క్రమంలోనే సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా డర్టీ పిక్చర్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. ఆ తర్వాత కన్నడ, మలయాళ భాషల్లోనూ సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా సినిమాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సిల్క్ స్మిత జీవిత కథ మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అందాల నటి జీవిత చరిత్రపై ఇప్పటివరకు వచ్చిన సినిమాలు.. కేవలం తనలోని గ్లామర్‌కు ప్రాధాన్యత ఇచ్చే తెరకెక్కించారు. అయితే ఇప్పుడు రానున్న సినిమాలో స్మిత జీవితంలోని మరో కోణాన్ని చూపించనున్నారు. తమిళ నిర్మాతలు చిత్రా లక్ష్మణ్, హెచ్. మురళి ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళంలో విడుదల చేయనున్న ఈ సినిమాకు… తమిళంలో  ‘అవల్ అప్పాడితాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగులో సినిమా టైటిల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. మణికందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సిల్క్ స్మిత మరణంపై పలు అనుమానాలున్న నేపథ్యంలో ఈ కొత్త చిత్రంలో ఆ అంశాన్ని చూపిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here