అచ్చెన్నాయుడు చెప్పిన‌ట్లు ఎన్నిక‌లు నిర్వ‌హించాలా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. క‌రోనా కార‌ణంగా నిలిచిపోయిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం సిద్ద‌మ‌వుతోంది. ఈ మేరకు రాజ‌కీయ పార్టీల‌తో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించింది. అయితే ఈ స‌మావేశంలో వైసీపీ పాల్గొన‌లేదు.

రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించింది. అయితే వైసీపీ ఈ సమావేశానికి హాజురుకాలేదు. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరం ఏంటని, దీనిపై నవంబర్ 2లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది.

అయితే ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ అప్ప‌ట్లో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని చెప్పారు. అయితే క‌రోనా నేప‌థ్యంలో ఎన్నికలను వాయిదా వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని, సభ్యసమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్‌ను కులం పేరుతో దూషించారని విమర్శించారు. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నిక‌లు పెడితే ఇబ్బందులు ఎదుర్కొంటామ‌ని వైసీపీ భావిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ఇక రాష్ట్రంలో ఎన్నిక‌లు పెట్టాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని అయితే కేంద్ర బృందాల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అచ్చెన్నాయుడు అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు. అయితే అచ్చెన్నాయుడు చెప్పిన‌ట్లు ఏపీలో ఎన్నిక‌లు జ‌రుగుతాయా అని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here