షాకిచ్చారా.. ఆర్కేపై సోము మార్క్ విశ్లేష‌ణ‌..

ఏపీ బీజేపీపై ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ‌కు ప్రేమ ఎక్కువైందా అన్న‌ట్లు అనిపిస్తోంది. తాజాగా ఆయ‌న బీజేపీ బాగు కోరుతూ రాసిన వ్యాసం చ‌దివిన వారికి నిజంగా రాధాకృష్ణ బీజేపీ స‌ల‌హాదారుగా ఉన్నారా అన్న భావ‌న క‌లుగుతోంది. కానీ ఇదే స‌మ‌యంలో బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సుతిమెత్త‌గా ఫైర్ అయిన తీరు చూస్తుంటే ఇదేదో పొలిటిక‌ల్ గేమ్‌లాగా ఉంది.

విష‌య‌మేమిటంటే ఇటీవ‌ల ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ బీజేపీని ఉద్దేశించి ఒక వ్యాసం రాశారు. ఇందులో బీజేపీ బాగుప‌డాలంటే జీవీఎల్ లాంటి వారిని అదుపుచేయాల‌న్నారు. జీవీఎల్ న‌ర‌సింహారావుతో బీజేపీ న‌ష్ట‌పోతోంద‌న్నారు. జీవీఎల్ వ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు వాపోతున్నార‌ని రాధాకృష్ణ విశ్లేషించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి చంద్ర‌బాబు లేఖ రాస్తే జీవీఎల్ స్పందించ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికారంలోకి రావాల్సిన పార్టీ వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇదేనా అని వ్యాసంలో రాశారు. మా జీవీఎల్ మా ఇష్టం అనుకుంటే మీకే న‌ష్ట‌మ‌ని ఆర్కే రాశారు.

ఇక ఆర్కే వ్యాఖ్య‌ల‌కు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు కూడా త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇస్తూ లేఖ రాశారు. జీవీఎల్ చంద్ర‌బాబును విమర్శించడం మాకే మంచిది కాదు అని రాధాకృష్ణ‌ అమోఘ‌మైన విశ్లేష‌ణ ద్వారా తెలిపార‌న్నారు. గ‌తంలో అడ్డ‌గోలుగా ప్ర‌ధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు, బీజేపీపై ప్రేమ పుట్టింద‌ని.. బీజేపీ ఏపీలో ఎద‌గ‌డం లేద‌ని తెగ ఫీల‌వుతున్నార‌ని ఆయ‌న ఆర్కేకు రాసిన లేఖ‌లో వ్యంగాస్త్రాలు సంధించారు. అయితే రాధాకృష్ణ వ్యాసంలో దాగి వున్న నిజం బీజేపీపై ప్రేమ ఉన్న‌ట్లు కాద‌ని.. ప‌థ‌నానికి చేరువ‌లో ఉన్న చంద్ర‌బాబు, టిడిపిని ర‌క్షించే ప్ర‌య‌త్న‌మ‌న్నారు.

బాధ్య‌తాయుత‌మైన ప‌త్రికా వృత్తిలో ఉన్న రాధాకృష్ణ రాజ‌కీయ పార్టీల‌కు స‌ల‌హాలు ఇస్తూ వ్యాసాలు రాయ‌డంపై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఇది రాధాకృష్ణ ఏం రాసినా అది చంద్ర‌బాబుకు అనుకూలంగా చేసేందుకు రాసింటార‌ని చిన్న పిల్ల‌వాడిన‌డిగినా చెబుతారు. ఏదోలా చంద్ర‌బాబుకు మైలేజీ తీసుకురావ‌డానికి ఆయ‌న వ్యాసాలు రాస్తుంటార‌ని పొలిటిక‌ల్ చ‌ర్చ న‌డుస్తోంది. ఇటీవ‌ల అమ‌రావ‌తి విష‌యంలో తామేమీ చేసేది లేద‌ని కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డంపై కూడా ఈయ‌న బీజేపిని ఉద్దేశించి ఇలా మాట్లాడ‌టానికి కార‌ణం కావ‌చ్చ‌ని తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖండించ‌డం కూడా రాధాకృష్ణ కోపానికి కార‌ణం కావ‌చ్చు. అయితే గ‌తంలో చంద్ర‌బాబు మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నార‌ని చాలా మంది మండిప‌డ్డారు. ఈ విష‌యంలో ఎలాంటి విచార‌ణ‌లు కూడా చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఇక జీవీఎల్ విష‌యానికొస్తే ఆయ‌న మొద‌టి నుంచి బీజేపీ మీద ఈగ వాల‌నివ్వ‌డం లేదు. తాజాగా బీజేపీలో చేరిన మాజీ టిడిపి నేత‌లు… ఇంకా టిడిపితో సాన్నిహిత్యంగా ఉండ‌టాన్ని జీవీఎల్ నిర్మొహ‌మాటంగా బీజేపీ అదిష్టానానికి తెలియ‌జేస్తున్నారు.

గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడిగా క‌న్నా ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడు సోము వీర్రాజు వ‌చ్చాక త‌న స్టైల్ మార్చారు. పార్టీలో ఎవ‌రైనా గీత దాటితో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్కే వ్యాసంపై సోము స్పందించిన తీరు చూస్తుంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో బీజేపీ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న డిస్క‌ష‌న్ మొద‌లైంది. దీన్ని బ‌ట్టి చూస్తే తెలుగుదేశం పార్టీని పైకి లేపాల‌ని రాధాకృష్ణ లాంటి వాళ్లు ఎన్ని ర‌కాలా ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం శూన్యంలా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here