సెటైర్ల మీద సెటైర్లు.. మాకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వ‌రేమో..

బీహార్ ఎన్నిక‌ల్లో ఉచిత వ్యాక్సిన్ అంటూ బీజేపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోపై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌లు పార్టీల నేత‌లు దీనిపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ నేత సిద్ద‌రామ‌య్య దీనిపై మాట్లాడుతూ క‌ర్నాట‌క‌కు ఉచిత వ్యాక్సిన్ ఉండ‌దేమో అన్న‌ట్లు వ్యాఖ్య‌లు చేశారు.

కర్ణాటకలో ఇప్పుడు ఎలాంటి సార్వత్రిక ఎన్నికలు లేవ‌ని.. అందుకే కన్న‌డీకుల‌కు ఉచిత వ్యాక్సిన్లు ఉండ‌వేమోన‌ని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. ఇక ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిపై కూడా ఆయ‌న సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రికీ ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామ‌ని సీఎం య‌డియూర‌ప్ప ప్ర‌క‌టిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్‌లో వ‌రుస ట్వీట్లు చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఆధారంగా ఉచిత వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారని, కోవిడ్ మహమ్మారిపై కేంద్రానికి ఆందోళన కలిగించడం లేదా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.

క‌ర్నాట‌క‌లో ఉచిత వ్యాక్సిన్‌పై క‌ర్నాట‌క‌కు చెందిన 25 మంది ఎంపీలు, సీఎం, బీజేపీ అధ్య‌క్షుడు అడుగుతార‌ని తాను ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికలు లేవని.. దీనికి అర్థం ఇప్పుడు కన్నడిగులకు ఉచిత వ్యాక్సిన్ ఉండదనా అంటూ ప్ర‌శ్నించారు. ప్రభుత్వం నుంచి ఉచిత వ్యాక్సిన్ కోసం కన్నడ ప్రజలు ఎదురుతెన్నులు చూస్తున్నారని, నరేంద్ర మోదీ తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ మేరకు హామీ ఇస్తారా అన్నారు. అవ‌కాశ‌వాద బీజేపీ అంటూ ట్వీట్ల‌కు హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశారు. మొత్తానికి బీజేపీ ఉచిత వ్యాక్సిన్ ఎన్నిక‌ల మేనిఫెస్టో హామీ తీవ్ర దుమారం రేపుతోంది. మ‌రి ఇప్ప‌టికైనా బీజేపీ దీన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here