దీపావ‌ళి వేళ రికార్డు అమ్మ‌కాలు.. చైనాకు రూ.40 వేల కోట్ల న‌ష్టం..

భార‌త్ చైనా స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా వ‌స్తువుల‌ను నిషేధించాల‌న్న పిలుపు ఇటీవ‌ల ఎక్కువైంది. దీంతో చైనా వ‌స్తువులు కొన‌కుండా ఉంటున్నారు. ఇక ప్ర‌భుత్వాలు చైనా యాప్‌ల‌ను కూడా నిషేధించాయి. ఈ ప‌రిస్థితుల్లో వ‌చ్చిన దీపావ‌ళి పండుగపైనే అంద‌రి ఆస‌క్తి నెల‌కొంది.

ఎందుకంటే దీపావళి అంటే ట‌పాసులు. ఇక చైనా ట‌పాసులు కొనొద్ద‌ని చెప్ప‌డంతో ప్ర‌జ‌ల్లో బాగా చైత‌న్యం వ‌చ్చింది. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా దీన్ని పాటించారు. దేశప్రజలు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. దీపావళి నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు రూ. 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ఆదివారం వెల్లడించింది.

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, రాజ్‌పూర్, భువనేశ్వరో, రాంచీ, భోపాల్, లక్నో, కాన్పూర్, నోయిడా, జమ్మూ, అహ్మదాబాద్, సూరత్, కొచిన్, జైపూర్, చండీఘడ్ నగరాల డేటాను సీఏఐటీ తీసుకుంది. వాణిజ్య మార్కెట్‌లో ఈ అమ్మకాలు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను సూచిస్తాయని, అంతేకాకుండా ఈ అమ్మకాలు వ్యాపారుల ముఖంపై ఆనందాన్ని తీసుకొచ్చాయని సీఏఐటీ తెలిపింది. కాగా చైనా ఉత్పత్తులను నిషేధించడంతో ఆ దేశానికి రూ. 40 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సీఏఐటీ అంచనా వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here