ట్రంప్ ఓడిపోయినట్లు ఒప్పుకుంటారా..

ప్ర‌పంచం మొత్తం ఉత్కంఠ‌గా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా త‌న ఓట‌మిని అంగీక‌రించ‌లేదు. మొద‌టి నుంచి ఎన్నిక‌ల్లో తానే గెలిచాన‌ని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ స్వ‌రం మారిన‌ట్లు క‌నిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారని ఓటమి పాలైన డొనాల్డ్‌ ట్రంప్‌ దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన చేసిన ఓ ట్వీట్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.

ట్రంప్ ఏమ‌ని ట్వీట్ చేశారంటే.. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగింది కాబట్టి ఆయన గెలిచారు. అయితే నేను ఓటమిని ఒప్పుకోవడం లేదు. ఓటింగ్‌లో పరిశీలకులను అనుమతించలేదు. ఓట్లలెక్కింపు కూడా డొమినియన్‌ అనే అతివాద వామపక్ష సంస్థ చేపట్టింది. ఆ కంపెనీకి ఏమాత్రం మంచిపేరు లేదు. వారు ఉపయోగించిన ఉపకరణాలుకూడా నాసిరకం. ఆఖరికి నేను గెలిచిన టెక్స్‌సలో లెక్కింపు జరిపే అర్హత డొమినియన్‌కు లేదు. మన నకిలీ మీడియా చోద్యం చూస్తోంది. మా న్యాయపోరాటాలు కొనసాగుతాయు’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

బైడెన్‌ గెలిచారు అన్న మాటను తొలిసారిగా వాడడాన్ని బట్టి ఆయన వాస్తవాన్ని గ్రహించారని అర్థమవుతోందని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్‌ సహాయనిరాకరణ కారణంగా అధికార మార్పిడి ప్రక్రియ ఇప్పటికీ మొదలుకాలేదు. విజేతను గుర్తించాల్సిన సాధారణ సేవల పాలనా విభాగం ఇప్పటికీ బైడెన్‌ను గుర్తించకుండా తాత్సారం చేయడం వల్ల అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రతిష్ఘంభన నెలకొంది. అమెరికా ఎన్నిక‌ల‌పై ప్ర‌పంచ దేశాలు మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here