దాస‌రిని భోజ‌నానికి పిలిచిన రామోజీ ఎంత ప‌ని చేశాడో తెలుసా

ఒకరు పత్రికా సింహం. ఒకరు దర్శక సింహం. దర్శక సింహం కు పత్రికా సింహం కు ఏవో పేచీలు వచ్చాయి. మొదటి సింహం రెండో సింహాన్ని బహిష్కరించింది. రెండో సింహానికి కోపం వచ్చింది. వెంటనే ఉదయం జన్మించింది. లక్ష కాపీలతో మొదలైంది. మొదటి సింహం వణికింది.

ఆ రెండు సింహాలు ఎవరో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.

రామోజీ, దాసరి…

తన పత్రికల్లో దాసరి పేరు కనపడటానికి వీలు లేదు. దాసరి సినిమాల మీద సితార లో సమీక్ష రాసినా, దర్శకుడి పేరు ప్రచురించ కూడదు. ఈటీవీ లో దాసరి సినిమాలు ప్రసారం చేసినా, దాసరి టైటిల్ కార్డ్ కట్ చేసేవారు.

అతి భయంకరం. రామోజీ కి ప్రభుత్వం అండ ఉన్నది. దాసరి కి అలాంటి దన్ను లేదు. ఆ స్పర్ధలు దాదాపు ఇరవై ఏళ్ళు కొనసాగాయి.

ఉదయం చేతులు మారినా, చివరకు అస్తమించినా, వైరం మాత్రం కొనసాగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో తన సినిమా షూటింగులు నిషేధించారు దాసరి.

ఒక సినిమాకు బయట ఎక్కడా లొకేషన్ దొరక్కపోవడంతో ఫిల్మ్ సిటీలో షూటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. దాసరి ని బతిమాలారు నిర్మాతలు. నిర్మాతల మనిషి కావడంతో ఒప్పేసుకున్నారు దాసరి. అప్పుడు ఫిల్మ్ సిటి అప్పుల్లో నడుస్తున్నది. పెద్దగా షూటింగ్స్ జరిగేవి కావు.

షూటింగ్ జరుగుతున్నది. ఎలా తెలిసిందో… రామోజీ దాసరికి ఫోన్ చేశారు. లంచ్ కు ఆహ్వానించారు. దాసరి వెంటనే ఒప్పుకున్నారు.

రామోజీ, దాసరి ఇద్దరు మాత్రమే కలిసి భోజనం చేశారు. ఏం మాట్లాడుకున్నారు అనేది తెలియదు. భోజనానంతరం దాసరికి వీడ్కోలు చెబుతూ రామోజీ కూడా దాసరి తో కలిసి బయటకు వచ్చారు.

అక్కడి దృశ్యం చూసిన దాసరి అవాక్కయ్యారు!

రామోజీ ఇంట్లోకి… బయట ప్రదేశానికి చాలా దూరం ఉన్నది. గుమ్మం నుంచి చాలా మెట్లు దిగాలి. మెట్ల నుంచి వీధి వరకు ఫిల్మ్ సిటీలో పనిచేసే వందలాదిమంది ఉద్యోగులు ఇరువైపులా సైనికుల్లా నిలబడి చప్పట్లు కొడుతూ దాసరి మీద పూల వర్షం కురిపించారు!!! దాసరి పులకించి పోయారు ఆ సత్కారానికి.

అలాంటి ఏర్పాట్లు జరిగిన విషయం రామోజీరావుకు తప్ప మరెవరికీ తెలియదు.

విజ్ఞత కలిగిన వారు తమ మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలను అలా పరిష్కరించు కుంటారు. ఆ తరువాత మళ్లీ వారిమధ్య పొరపొచ్చాలు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here