ఫ్లాప్‌ మూవీల వల్లే ఇండస్ట్రీ బతుకుతోంది..! పూరి లాజిక్‌ విన్నారా.?

టాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకరు. కమర్షియల్‌ అంశాలతో పాటు సమాజంలోని అంశాలను తన సినిమాలో ఉండేలా చూసుకోవడంలో పూరీది అందె వేసిన చేయి. కేవలం తన సినిమాలతోనే కాకుండా తన మాటల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టకుంటాడు పూరీ. ఈ దర్శకుడు గతకొన్ని రోజులుగా యూట్యూబ్‌ వేదికగా ‘పూరీ మూజింగ్స్‌’ పేరుతో కొన్ని వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పూరీ.. ఫ్లాప్‌ సినిమాల గురించి మాట్లాడాడు. తన కెరీర్‌లో ఎన్ని విజయాలు అందుకున్నాడో అదే స్థాయిలో పరుజయాలను కూడా ఎదుర్కున్నాడు పూరీ జగన్నాథ్‌. అయితే సినిమాల ఫ్లాప్‌ల గురించి తనదైన శైలిలో వివరించాడు పూరీ.

ఇంతకీ పూరీ ఆ వీడియోలో చెప్పిందేంటంటే.. ‘ఫ్లాప్‌ను ఎవ్వరూ కోరుకోరు.. ఫ్లాప్‌ అవుతుందని తెలిస్తే ఎవరూ సినిమా తీయరు. ఏడాదిలో 200 సినిమాలు వస్తాయి.. హిట్‌లు, బ్లాక్‌ బస్టర్‌లు కలిపి పదే ఉంటాయి. మిగిలిన 190 ఫ్లాపులే.. జీవితాంతం ఈ ఫ్లాప్‌ సినిమాలు చూడలేక.. వాటిని అనలైజ్‌ చేయలేక జర్నలిస్ట్‌ లకు తిక్కలేసి రివ్యూలతో వాయించి పడేస్తారు. ఎందుకంటే అన్ని సినిమాలు అలాగే ఏడుస్తున్నాయి. ఆ రివ్యూల దెబ్బకి అప్పటికే అన్నీ అమ్ముకున్న ప్రొడ్యూసర్.. ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోతాడు. అతని స్థానంలో ఇంకొకరు వస్తారు. ఇంకో ఫ్లాప్‌ సినిమా తీస్తాడు. నిజమేంటంటే ఆ 190 ఫ్లాప్‌ సినిమాల మీదే ఇండస్ట్రీకి బతుకుతోంది. ఇక్కడున్న అందరికీ అన్నం పెట్టేవి అవే.. ఫ్లాప్‌ సినిమాల వల్ల కూడా దేశానికి ఎంతో మేలు జరుగుతోంది. పలానా సినిమా ప్లాప్ అవుతుందని తెలిస్తే ఎవరు డబ్బులు పెట్టేందుకు ముందుకురారు కూడా.. బిజినెస్ యాంగిల్ లో చూస్తే అసలు సినిమానే తీయకూడదు. ఎందుకంటే ఇది రిస్కీ బిజినెస్ ఎవరు చేస్తారు.. కానీ సినిమా అంటే పిచ్చి ఉన్నోళ్ళు మాత్రమే సినిమాని చేస్తారు. సినిమా రివ్యూస్‌ రాసే అందరికీ చేతులెత్తి మొక్కుతూ అడుగుతున్నా.. మీరు కాపాడాల్సింది ఇలాంటి ఫ్లాప్‌ సినిమాలనే.. బ్లాక్ బస్టర్లని కాదు. తెలిసో తెలియకో ఓ డైరెక్టర్ ఫ్లాప్‌ తీసి ఉండొచ్చు. కానీ ఆ డైరెక్టర్ వల్ల కొంతమందికి పని, తిండి దిరికింది. కాబట్టి ఆ డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీకు రేటింగ్ ఒకటే ఇవ్వాలనిపిస్తే రెండు ఇవ్వండి. రెండే వేయాలనిపిస్తే మూడు వేయండి. ఆ ఒక్క స్టార్ పెరగడం వల్ల కొన్ని కుటుంబాలు బతుకుతాయి.
సినిమా చూసేటప్పుడు ఇందులో ప్రాణం ఉందా? లేదా శవమా? దీన్ని నేను ఎలా కాపాడగలను అనే చూడండి. దయచేసి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో అప్పుడు లైవ్ అప్డేట్లు ఇవ్వడం మానేయండి.. ఇది ఏ దేశంలో కూడా ఉండదు.. ప్రతి ప్లాప్ సినిమా వెనుక కూడా కొన్ని నెలల కష్టం ఉంటుంది.. ఒకవేళ ఫ్లాప్ తీసినోడు కనబడితే గట్టిగా ఒక హగ్ ఇవ్వండి. ఎందుకంటే అతనే వంద మందికి తిండిపెట్టిన హీరో. ఆ ఫ్లాపులుగానీ లేకపోతే అందరం అడుక్కుతింటాం’ అంటూ తనదైన మార్కు డైలాగ్‌లతో ఫ్లాప్‌ సినిమాల గురించి పూరీ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here