నోట్ల ర‌ద్దు గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాని మోదీ..

దేశంలో నోట్ల ర‌ద్దు అంశం ప్ర‌తి ఒక్క‌రికీ మ‌ర్చిపోలేనిది. పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న నిర్ణ‌యంతో సామాన్యులకు చుక్కలు క‌నిపించాయి. త‌మ ద‌గ్గ‌ర ఉన్న నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. అప్ప‌ట్లో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు రోజంతా క్యూలైన్లో నిల‌బ‌డిన రోజుల‌ను ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు.

2016 న‌వంబ‌ర్ 8వ తేదీన పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ అప్ప‌ట్లో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకుంటున్నా ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను మూటగ‌ట్టుకున్నారు. తాజాగా ఈ విష‌యంపై ప్ర‌ధాని మోదీ స్పందించారు. నోట్ల ర‌ద్దు గురించి ఇంత వ‌ర‌కు మాట్లాడ‌ని మోదీ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా మాట్లాడారు. నోట్ల రద్దుతో నల్లధన ప్రవాహం తగ్గి పారదర్శకత పెరిగిందని మోదీ అన్నారు. నల్లధనాన్ని తగ్గించేందుకు పన్ను చెల్లింపులు పెంచేందుకు నోట్ల రద్దు బాగా ఉపకరించిందన్నారు. అంతే కాకుండా పన్ను చెల్లింపుల్లో పారదర్శకత, నిలకడకు ఊతాన్ని ఇచ్చిందన్నారు.

ఈ ఫలితాలు జాతీయ పురోగతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మోదీ ట్విట్ట‌ర్‌లో తెలిపారు. మోదీ చేసిన ఈ ట్వీట్‌కు అవినీతి రద్దు అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశారు. వీటికి తోడు నోట్ల రద్దు ప్రయోజనాలను తెలుపుతోన్న డేటాను షేర్ చేశారు. అయితే నల్లధనాన్ని కట్టడీ చేయడం, ఉగ్రవాదులను దెబ్బ కొట్టడం లాంటి లక్ష్యాలు ఈ నిర్ణయం వెనుక ఉన్నట్లు నోట్ల రద్దు ప్రకటనలో ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అయితే రిజర్వు బ్యాంకు చెప్పిన లెక్కలు వేరేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here