ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉందో తెలుసా..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం లెవ‌ల్స్ పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ప‌రిస్థితులు పూర్తిగా ఆందోళ‌నక‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట‌ల కాల్చివేత‌లే ఇందుకు కార‌ణంగా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఢిల్లీలో ఆదివారం ఉదయం వెల్లడైన సమాచారం ప్రకారం వరుసగా నాలుగో రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) సివియర్ కేటగిరీలో ఉంది. అయితే పరిస్థితిలో కొంత వరకు మెరుగుదల కనిపించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించిన సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటలకు ఏక్యూఐ 405 ఉంది. ఏక్యూఐ 401 నుంచి 500 వరకు ఉంటే, దానిని సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో ప్రజల శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా బాలలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఢిల్లీలో ఏక్యూఐ గురువారం 450, శుక్రవారం 406, శనివారం 427గా నమోదైంది. నవంబరు 10 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెప్పారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సుమారు 4,500 పంట దుబ్బుల కాల్చివేత సంఘటనలు జరిగాయి. ఢిల్లీ గాలిలోని మొత్తం పీఎం2.5లో దాదాపు 32 శాతానికి కారణం ఈ కాల్చివేతలేనని శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం కన్నా శనివారం గాలి వేగం మెరుగైనప్పటికీ ఈ పీఎం2.5ను తగ్గించలేకపోయింది.

కాగా ఢిల్లీలో కాలుష్యానికి అనేక కారణాల్లో ఒకటి వరి దుబ్బులను కాల్చడం. పొరుగునే ఉన్న ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వరి పంటల కోత తర్వాత మిగిలిన వరి దుబ్బులను కాల్చుతూ ఉంటారు. దీన్ని నివారించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వరి దుబ్బులను కాల్చకుండా రైతులను నిరోధించేటపుడు ఎటువంటి వేధింపులకు పాల్పడరాదని అధికారులను ఆదేశించారు. పంటలను కోసిన తర్వాత మిగిలిన దుబ్బులను వేరొక విధంగా వినియోగించేందుకు ప్రయత్నించాలన్నారు. బయోఫ్యూయల్, విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రోత్సహించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here