బీహార్ ఎన్నిక‌ల్లో పోలింగ్ ఏజెంట్ మృతి.. మాస్క్ పెట్టుకోకుండా ఓటు వేయ‌డానికి వ‌చ్చిన ప‌బ్లిక్‌

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల్లో పాల్గొన్న పోలింగ్ ఏజెంట్ మృతిచెందారు. ఈయ‌న బీజేపీకి చెందిన ఏజెంట్‌. దీంతో అక్క‌డ విషాదఛాయ‌లు అల‌ముకున్నాయి. కాగా ఓ వ్య‌క్తి మాస్క్ పెట్టుకోకుండా ఓటు వేయ‌డానికి వ‌చ్చారంటూ పోలీసులు మంద‌లించారు.

బీహార్‌లో నేడు మొద‌టి విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 71 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణ కుమార్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫుల్మా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 258లో ఆయన ఏజెంట్‌గా ఉన్నారు. పోలింగ్ బూత్‌లో కూర్చోగానే అకస్మాత్ముగా ఛాతీలో నొప్పి వచ్చిందని, చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే కొంద‌రు మాస్క్ లేకుండా ఎన్నిక‌ల్లో పోలింగ్‌కు వ‌స్తున్నార‌ని అధికారులు మండిప‌డుతున్నారు. సాసారామ్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక ఓటరు ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడు. పోలీసులు మాస్క్ పెట్టుకోవాలని సూచించగా, ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఆ వ్యక్తిని పోలీసులు మాస్క్ గురించి అడగగా…తాను మాస్క్ పెట్టుకునే బయటకు వచ్చానని, అయితే అది ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. దీంతో అతనికి… పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తరువాత పోలీసులే ఆ వ్యక్తికి మాస్క్ ఇచ్చారు.

ఈ ఎన్నిక‌ల్లో నేడు రెండు కోట్ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పోలింగ్ ప్ర‌శాంతంగా సాగుతోంది. ఇదిలా ఉంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోలింగ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్ర‌జ‌లంతా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఆర్జేడీ తరఫున 42 మంది అభ్యర్థులు, జేడీయూ 35, కాంగ్రెస్ 21, సీపీఐ ఎంఎల్ 8, హెచ్ఏఎం 6, వీఐపీ అభ్యర్థి ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు ఆర్‌ఎస్ఎల్‌పీ 43, ఎల్‌జేపీ 42, బీఎస్‌పీ 27 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here