శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు :పవన్ కళ్యాణ్

అందాల నటి శ్రీదేవి ఇక లేరు కొన్ని దశాబ్దాలపాటు యువకుల హృదయాలలో గూడు కట్టుకున్న ఈ అందాల తార ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు శ్రీదేవి దుబాయ్లో కుటుంబంతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి ఉన్నట్టుండి కుప్పకూలరు. దీంతో శ్రీదేవిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మరణించడం జరిగింది. శ్రీదేవి మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయింది.ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్  శ్రీ దేవి మృతి పట్ల తన విచారణ వ్యక్తం చేశారు….”అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షకలోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు.
శ్రీదేవి ఇకలేరు అనే మాట నమ్మలేనిది. కానీ ఆమె చేసిన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. ఆమె భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఆమె కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యాన్ని ఆ భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. తెలుగులో బడిపంతులు చిత్రంలో ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో ఆమె కళ్లు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.అదే విధంగా అన్నయ్యతో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో దేవకన్య ఇంద్రజగా ఆమె కనిపించిన తీరు, ‘మానవా’ అంటూ ఆమె చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకునేవే.
ఆమె అమాయకత్వపు నటన మరువలేనిది. కొంత విరామం తర్వాత హిందీలో ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ చిత్రాల ద్వారా శ్రీదేవి తన శైలి నటనను ఈ తరానికీ చూపించారు. శ్రీదేవి తన పెద్ద కుమార్తెను కథానాయికగా చిత్రసీమకి తీసుకువస్తున్న తరుణంలో ఆమె ఈ లోకాన్ని వీడిపోవడం బాధాకరం” అంటూ జనసేన పార్టీ తన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేసింది. శ్రీ దేవి కుటుంబానికి కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here