ఒక్క ఉద్యోగం కోసం రూ.12 కోట్లు ఇచ్చాడంట‌.. నూత‌న్ నాయుడు మోసాలు

రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ళిత యువ‌కుడు శిరుముండ‌నం కేసులో అరెస్టైన నూత‌న్ నాయుడు అక్ర‌మాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసు విష‌యంలోనే ఆయ‌న‌పై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తుంటే మ‌రికొన్ని కేసులు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్నాయి.

నిరుద్యోగ యువ‌కుల‌కు ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని నూత‌న్ నాయుడు మోసం చేశాడంటూ కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వీరి వద్ద నుంచి రూ. 12 కోట్ల దాకా డ‌బ్బులు లాగేశాడ‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీనికి సంబంధించి మ‌హారాణి పేట పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదైంది. ఎస్‌.బీ.ఐలో ఉద్యోగాల పేరుతో అమాయ‌కుల‌కు ఆశ చూపిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణాలోని చేవెళ్ల‌కు చెందిన శ్రీ‌కాంత్ రెడ్డితో పాటు విశాఖ జిల్లాకు చెందిన నూక‌రాజుల‌ను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఎస్‌బీఐలో సౌత్ రీజియ‌న్ డైరెక్ట‌ర్ పోస్టు కోసం శ్రీ‌కాంత్ రెడ్డి వ‌ద్ద నుంచి రూ. 12 కోట్లు తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇవ్వ‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నిజంగా కోట్ల రూపాయ‌లు ఉద్యోగం కోసం ఇచ్చారా లేక వేరే లొసుగులేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారించాల‌ని పోలీసులు అంచనాకు వ‌చ్చారు.  ఇక బ్యాంకులో ఉద్యోగం కోసం నూక‌రాజు రూ. 5 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లు బాదితులు చెబుతున్నారు. డ‌బ్బులు తీసుకొని రెండు సంవ‌త్స‌రాలు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేక‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు బాదితులు అంటున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తేనే నూత‌న్ నాయుడు వ్య‌వ‌హారంలో నిజానిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here