ఆ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఎవ్వ‌రూ వెళ్ల‌కూడ‌దు..

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటి వ‌ద్ద ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, ఆయన ఇంటిలోకి బయటవారెవరైనా ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆప్ తెలిపింది. రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక ట్వీట్‌లో తెలిపింది.

సింఘు సరిహద్దులో గత 13 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న రైతులను కేజ్రీవాల్ సోమవారంనాడు కలుసుకున్నారు. అప్పట్నించి ఆయన పోలీసుల గృహ నిర్బంధంలో ఉన్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను సోమవారంనాడు కలవడానికి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, కనీసం కార్యకర్తలను కూడా కలుసుకునేందుకు అనుమతించలేదని, బీజేపీ వాళ్లను మాత్రం కేజ్రీవాల్ నివాసం వెలుపల బైఠాయించేందుకు అనుమతించారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.

సింఘు సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను కేజ్రీవాల్ కలుసుకుని సంఘీభావం తెలిపారని, ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన ఇంటికి అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి హౌస్ అరెస్టు చేశారని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ తరఫున పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసినట్టు చెప్పారు. రైతుల ఆందోళన, దేశవ్యాప్త బంద్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కనీస మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చాలని పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు పెట్టిన సందర్భంలోనే తాము కేంద్రానికి సూచించామని ఆప్ వివరించింది. రైతులకు బాసటగా ఉంటామని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here