దేశ వ్యాప్తంగా బంద్‌.. అక్క‌డ మాత్రం ఎన్నిక‌ల పోలింగ్‌..

దేశ వ్యాప్తంగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. నేడు భార‌త్ బంద్ కొన‌సాగుతోంది. అయితే అక్క‌డ మాత్రం ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. కేరళ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో స్థానిక సంస్థల పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పత్నం తిట్ట, అల్లప్పుజా, ఇడుక్కి జిల్లాల్లోని 395 స్థానిక సంస్థల్లో 6,910 వార్డుల్లో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ గంట సమయంలో 6 శాతం ఓట్లు పోలయ్యాయి. పత్నం తిట్ట, అల్లప్పుజా, ఇడుక్కి జిల్లాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ కొనసాగుతోంది.

మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు సాగనున్న స్థానిక సంస్థల పోలింగ్ పర్వంలో సీపీఐ (ఎం) సారధ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతాపార్టీ ఆధిపత్యంలోని ఎన్డీఏ బరిలో ఉంది. తిరువనంతపురంలో జరిగిన మొదటి విడత స్థానిక సంస్థల పోలింగులో బీజేపీ నాయకుడు కుమ్మానం రాజశేఖరన్ ఓటు వేశారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని రాజశేఖరన్ జోస్యం చెప్పారు.

మొదటివిడత 5 జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల్లో 88,26,873 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ సాగుతోంది. భారీ పోలీసుబందోబస్తుతో భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ పోలింగ్ సాగుతోంది. కొవిడ్ ఓటర్లున్న ఆసుపత్రులకు పోలింగ్ అధికారులు పీపీఈ కిట్లు ధరించి ప్రత్యేక పెన్నులతో సంతకాలు చేయించుకొని పోస్టల్ బ్యాలెట్లు తీసుకుంటున్నారు. బంద్ ప్రభావం పోలింగుపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here