బీహార్ ముఖ్య‌మంత్రిగా మ‌ళ్లీ నితీష్ కుమార్‌.. మిగ‌తా మంత్రులు ఎవ‌రో..

బీహార్ ముఖ్య‌మంత్రిగా నితీష్ క‌మార్ మ‌రోసారి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈమేర‌కు ఎన్డీయే కూటమి ఆయ‌న్ను ఎన్నుకుంది. బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో 125 స్థానాలతో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజారిటీని సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.

రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా ఎన్డీయేలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఆదివారం ఉదయం బీజేపీ, జేడీయూ నేతలు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. మంత్రి పదవుల పంపకం, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఎన్డీయేలో చేర్చుకోవడంపై కూడా చర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఎన్నిక‌ల్లో గెలుపు త‌ర్వాత మొద‌టిసారి ఎన్డీయే కూట‌మి స‌మావేశం అయ్యింది. దీంతో బీహార్‌లో స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. అయితే ముఖ్య‌మంత్రిగా నితీష్ ఉన్న‌ప్ప‌టికీ ఇత‌ర మంత్రుల ప‌ద‌వులు సంగ‌తిపైనే ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. మెజార్టీ సాధించిన బీజేపీకి కీల‌క ప‌ద‌వులు ఇవ్వాల‌న్న అంశం క‌చ్చితంగా తెర‌మీద‌కు వ‌స్తుంది. దీంతో డిప్యూటీ సీఎం, హోం శాఖ‌, ఆర్థిక శాఖ లాంటి కీల‌క శాఖ‌లు ఏ పార్టీకి ద‌క్కుతాయ‌న్న‌ది ఇక్క‌డ తీవ్రంగా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ విష‌యంలో ఎన్డీయే కూట‌మి ఎలా ముందుకు వెళుతుంద‌న్న‌ది ఆస‌క్తిగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here