కేర‌ళ‌లో కొత్త వ్యాధి.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు..

క‌రోనాతో ప్ర‌పంచం అల్లాడిపోతున్న వేళ కొత్త వ్యాధులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా ఎంతో మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న విష‌యం తెలిసిందే. దేశంలో క‌రోనా వ్యాక్సిన్ కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో కేర‌ళ‌లో కొత్త వ్యాధి వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లు భ‌య‌పడుతున్నారు.

కేరళలో కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా ప్లాస్మోడియం ఒవేల్ అనే కొత్త మలేరియాను ఆరోగ్య శాఖ గుర్తించింది. సూడాన్ నుంచి వచ్చిన సైనికుడి వద్ద ఈ వ్యాధిని గుర్తించింది. ఆ సైనికుడికి కన్నూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలెసి, ప్లాస్మోడియం ఒవేల్ అనే ప్రోటోజోవాలు మలేరియాకు కారణమవుతాయి. వీటిలో ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ మన దేశంలో అత్యంత సాధారణంగా కనిపిస్తాయి. ప్లాస్మోడియం ఒవేల్ సాధారణంగా ఆఫ్రికాలో కనిపిస్తుంది.

అయితే ఈ వ్యాధి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేకే శైలజ చెప్పారు. సకాలంలో చికిత్స చేయడంతోపాటు ముందస్తు నివారణ చర్యలు చేపడితే దీనిని నివారించవచ్చునన్నారు. ఈ రకం మలేరియా వల్ల ప్రాణహాని సంభవిస్తుందనే సమాచారం లేదన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వీస్ కోసం వెళ్ళిన సైనికుడు తిరిగి వచ్చినపుడు ఈ వ్యాధి కనిపించిందన్నారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ వైరస్‌ను ధ్రువీకరించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here