చాలా సీరియ‌స్‌గా మాట్లాడిన న‌రేంద్ర మోదీ..

న‌రేంద్ర మోదీ చాలా సీరియ‌స్‌గా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై రైతులు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్రం ప్ర‌భుత్వం ఎంత చెప్పినా రైతులు విన‌డం లేదు. దీంతో మోదీ రైతుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రజలు, రైతులు నమ్మకం ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థించారు. మంచి ఉద్దేశాలతోనే ఈ చట్టాలను తీసుకొచ్చామని, ఎలాంటి దురుద్దేశాలూ లేవని తేల్చి చెప్పారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని, దానికి ఎలాంటి ఆటంకమూ కలగదని చెప్పారు. నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని, గత 20,30 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాయని అన్నారు.

దేశంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, కాస్త ప్రోగ్రేసివ్ భావాలతో ఆలోచించే రైతులు ఈ వ్యవసాయ సంస్కరణలను కోరుకున్నారని మోదీ పేర్కొన్నారు. కొందరి రాజకీయ పునాదులు కూకటి వేళ్లతో సహా కదులుతున్నాయి కాబట్టే, నూతన చట్టాల పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నూతన చట్టాలపై ఇప్పుడు లబోదిబోమంటూ కన్నీరు కారుస్తున్న వారు, ఎనిమిదేళ్లుగా స్వామినాథన్ రిపోర్టులను ఎందుకు తొక్కి పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీపై మోదీ మండిప‌డ్డారు. తన పదేళ్ల పదవీ కాలంలో కాంగ్రెస్ 50 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని చెప్పుకుందని, తమ హయాంలో మాత్రం ‘కిసాన్ సమ్మాన్ యోజన’ అనే పథకం కింద ప్రతి యేడాది 75 వేల కోట్ల రూపాయలను రైతులకు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రైతులను భ్రమల్లో ఉంచుకోవడం ప్రతిపక్షాలను మానుకోవాలని, ఈ నూతన చట్టాలను అమలులోకి తెచ్చి ఆరు నెలలు గడిచాయని, ఈ ఆరు నెలలు మౌనంగా ఉన్న విపక్షాలు హఠాత్తుగా ఉద్యమాన్ని లేవదీశాయని తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతుల భుజాలపై తుపాకులను పెట్టి కాలుస్తున్నారని మోదీ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here