తన బయోపిక్‌ వివాదంపై స్పందించిన మురళీధరన్‌..

శ్రీలంక స్టార్‌ ప్లేయర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌ జీవిత కథ ఆధారంగా తమిళ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో ‘800’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మురళీ ధరన్‌ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ప్రపంచం గుర్తించే బౌలర్‌గా ఎదిగిన ఆయన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై రాజకీయ వివాదం మొదలైంది. గతంలో మురళీధరన్‌ ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం. దీంతో మురళీధరన్‌ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు.

‘నేను జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాను. ఇవి నాకు కొత్తవేమీ కావు. కొన్ని వర్గాల ప్రజలు సినిమా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. నా జీవితం యుద్ధ భూమిలో మొదలైంది. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయారు. మా కుటుంబం కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక కష్టాలు పడ్డాం. నేను ఈ ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కొన్నాను, క్రికెట్‌లో  నిలదొక్కుకొని ఏవిధంగా విజయం సాధించాను  అనేది ఈ చిత్రంలో చూపిస్తారు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించటం నా తప్పా? ఈ చిత్రాన్ని అనేక కారణాల వల్ల రాజకీయం చేస్తున్నారు. నేను 2009లో తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. అ వ్యాఖ్యలు ఇప్పటికీ నన్ను ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. యుద్ధం 2009లో ముగిసింది. జీవితమంతా యుద్ధం చూసిన వారికి అది ముగియడమనేది మంచి మార్పు. నేను ప్రశాంత జీవితం గడపాలని ఎదురుచూస్తున్నాను. అందరి తమిళుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి నా కథను వెండితెరపై చెప్పాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడీ స్టార్‌ ప్లేయర్‌. మరి మురళీధరన్‌ చేసిన ఈ వ్యాఖ్యలతోనైనా వివాదం చల్లారుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here