మలయాళ సినిమా రీమేక్‌లో మోహన్‌బాబు..?

క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ గా కెరీర్‌ ప్రారంభించి అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు హీరో మోహన్‌బాబు. తనదైన పంచ్‌ డైలాగ్‌లతో ఇప్పటికీ యువ హీరోలకు పోటీనిస్తూ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌ బాబు మలయాళ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో సూరజ్‌ వెంజమూడు, సౌబిన్‌ షాహిర్‌ ప్రధాన పాత్రలో ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని ఘన విజయాన్ని సాధించింది. ఒక రోబోకు వృద్ధుడికి మధ్య సాగే భావోద్వేగభరిత ప్రయాణమే ఈ సినిమా కథ. ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు పిల్లలు వెళ్లిపోవడంతో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పడే వ్యథల్ని ఈ సినిమాలో ఎంతో సున్నితంగా చూపించారు.

ఇక మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై ఆయనే స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు  తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక  ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. తనదైన ఎమోషన్‌ను పండించే మోహన్‌బాబు ఈ పాత్రకు సరైన న్యాయం చేస్తారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here