30 మందిపై లైంగిక దాడి కేసులో ఉన్న వ్య‌క్తికి ఎమ్మెల్యే టికెట్‌..

ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల విచార‌ణ‌పై ఇటీవ‌ల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఎంత మంది ఎంపి, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్న వివ‌రాలు కూడా వెల్ల‌డించింది. అయితే ఇప్పుడు అలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారే మళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నిక‌లు ఇందుకు వేదిక కానున్నాయి.

ముజ‌ఫ‌ర్‌పూర్ షెల్ట‌ర్ హోంలో బాలిక‌ల‌పై లైంగిక దాడి కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ సైతం విచారణ జరుపుతోంది. ఈ కేసులో అప్ప‌టి మాజీ మంత్రి మంజూవ‌ర్మ‌తో పాటు ఆమె భ‌ర్త చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. వీరు కోర్టులో లొంగిపోయి బెయిల్‌పై ఉన్నారు. తాజాగా మంజూవ‌ర్మ‌కు నితీష్ కుమార్ టికెట్ ఇచ్చారు. ఇటీవ‌ల 90మందితో కూడిన‌ జాబితాను ఆ పార్టీ చీఫ్‌, సీఎం నితీష్‌ కుమార్ ప్ర‌క‌టించారు. ఇందులో ఈమె పేరు కూడా ఉంది. బెగుసరై సమీపంలోని బర్యార్‌పూర్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఆమె బరిలో నిలువనున్నారు.

అప్ప‌ట్లో లైంగిక దాడుల ఆరోప‌ణ‌లు రావడంతో నితీష్ కుమార్ ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. 2018లో పార్టీ నుంచి కూడా తప్పించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆమెకు టికెట్ కేటాయిస్తూ లిస్టు విడుద‌ల చేయ‌డంతో అంతా షాక్‌కు గుర‌య్యారు. అప్పుడు లైంగిక ఆరోప‌ణ‌ల‌తో చ‌ర్య‌లు తీసుకున్న వారే ఇప్పుడు మ‌ళ్లీ టికెట్ ఇచ్చారేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేర‌ని అనుకుంటున్నారు. ఇక ప్ర‌తిప‌క్షాలు సైతం దీన్ని అస్త్రంలా చేసుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ప్ర‌జాప్ర‌తినిధుల కేసుల‌పై వ్యాఖ్య‌లు చేస్తున్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ టికెట్ ఇస్తూ నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఎక్క‌డ‌వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here