మంత్రి బుగ్గ‌న రాజీనామా చేయాలి..

ఏపీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంధ్ర‌నాథ్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. మంత్రి బుగ్గ‌న అస‌మ‌ర్థ‌త‌, అల‌స‌త్వం వ‌ల్ల రాష్ట్రంలో డ‌బుల్ పేమెంట్లు జ‌రుగుతున్నాయ‌న్నారు.

రాష్ట్రంలో పెన్ష‌న్ల‌కు సంబంధించి రూ.1400 కోట్లు జ‌మ‌చేయాల్సి ఉండ‌గా.. అందుకు డ‌బుల్ రూ. 2800 కోట్లు జ‌మ చేశార‌ని దేవినేని ఉమ అన్నారు. సామాజిక పెన్ష‌న్ల‌కు సంబంధించి జులై 30వ తేదీన రూ. 2800 కోట్లు నేరుగా ఎంపీడీవోల ఖాతాల‌కు నేరుగా వెళ్లిపోయాయ‌ని ఆయ‌న చెప్పారు.

అయితే వాస్త‌వానికి రూ. 1400 కోట్లు మాత్ర‌మే ఎంపీడీవోల ఖాతాల‌కు వెళ్లాల్సి ఉంద‌న్నారు. కానీ అందుకు రెట్టింపు నిధులు జ‌మ‌చేశార‌ని వివ‌రించారు. ఆర్థిక శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ త‌న త‌మ్ముడు శ్రీ‌నివాస‌రావును ఆర్థిక శాఖ‌లో ప్రోగ్రాం మేనేజ‌రుగా నియ‌మించార‌న్నారు.

అదే ఇక్క‌డ ఎక్కువ అమౌంట్ జ‌మ‌చేసే ప‌రిస్థితి తీసుకొచ్చింద‌న్నారు. ఇద్ద‌రు ప్రోగ్రాం మేనేజ‌ర్లకు వేరువేరుగా ఆదేశాలు ఇవ్వ‌డంతోనే రూ. 1400 కోట్లు అద‌నంగా వెళ్లిన‌ట్లు చెప్పారు. ఆ సొమ్మ‌ను వెన‌క్కు తెప్పించేందుకు సీఎం, ఆర్థికశాఖ మంత్రి అగ‌చాట్లు ప‌డ్డార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ విష‌యంలో బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

మంత్రి బుగ్గ‌న‌, ఆ శాఖ అధికారుల అస‌మ‌ర్ధ‌త వ‌ల్లే ఇలా జ‌రిగింద‌న్నారు. వెంట‌నే మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాజీనామా చేయాల‌న్నారు. ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై స్పందిస్తూ అచ్చెన్నాయుడుకి క‌రోనా రావ‌డానికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌న్నారు. ఆయ‌న‌కు ఏమైనా జ‌రిగితే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here