ఎంఐఎం క‌మ‌ల‌హాస‌న్ పార్టీతో పొత్తు పెట్టుకోనుందా..?

ఎంఐఎం పార్టీ త‌మిళ‌నాడుపై దృష్టి సారించ‌నుంది. రానున్న ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో పోటీ చేయాల‌ని భావిస్తోంది. అయితే అక్క‌డున్న చిన్న పార్టీల‌తో పాటు క‌మ‌ల‌హాస‌న్ పార్టీతో కూడా క‌లిసి పోటీ చేయాల‌ని ఎంఐఎం అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్, ఎంఐఎం ఒవైసీ మధ్య పొత్తు కుదుర‌బోతోంద‌ని ప‌లు పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఎంఐఎం కార్య‌వ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి ఒవైసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనవరి మాసాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారు. తమిళనాట దాదాపు 25 సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఈ 25 సీట్లలోనూ కమల్ హసన్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు.

బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. అయితే వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ హసన్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు.’’ అని ఎంఐఎం వర్గాలు పేర్కొన్నాయి. వెల్లోర్, రాణిపేట్, తిరుపట్టూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుడుకొట్టాయ్, తిరుచ్చి, మదురై, తిరునల్వేలీ ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలను ఆధారంగా చేసుకొని ఎంఐఎం తమిళనాట తన ఉనికిని చాటాలని డిసైడ్ అయ్యింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here