ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన మంత్రి కొడాలి నాని..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల అంశం రాజ‌కీయ వేడిని రాజేస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ ర‌మేష్ కుమార్ సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సిద్దంగా లేదు. ఈ ప‌రిస్థితుల్లో ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

గుడివాడలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలను కోవడం సిగ్గుచేటన్నారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొన‌డానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరన్నారు. నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలన్నారు.

ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తి కారణమవుతుంది. బుద్ధి జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రత ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకమ‌న్నారు. హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కొడాలి వ్యాఖ్య‌లు ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here