డొనాల్డ్ ట్రంప్ విష‌యంలో కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ముగిసి చాలా రోజులు అయినా ఇంకా అక్క‌డ రాజకీయాలు ఆస‌క్తిగానే ఉన్నాయి. ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ట్రంప్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌రి ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తార‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

ఎన్నికల ఫలితాలకు సంబంధించి కీలక రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో జో బైడెన్ గెలుపుపై ట్రంప్ కోరినట్టు స్టే విధించేందుకు అక్కడి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది. చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలైపోవు అంటూ న్యాయమూర్తులు ఈ సందర్భంగా ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులపై ట్రంప్ ఫెడరల్‌ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌లో కేసు దాఖలు చేశారు. అయితే.. న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ కేసును కొట్టేస్తూ ఏకగ్రీవంగా తీర్పు వెలువరించారు.

ఆరోపణలను రుజువు చేసే సాక్ష్యాలేవీ ట్రంప్ తరఫు న్యాయవాది ఇవ్వలేకపోయారని వారు తేల్చి చెప్పారు. ఈ పరిణామంతో ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. కాగా..ట్రంప్‌కు ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై ఆయన వేసిన డజనుకు పైగా కేసుల్లో కోర్టులు ఆయనకు వ్యతిరేకమైన తీర్పులు వెలువరించాయి. పోరాటం కొనసాగుతుందని ఢంకా బజాయించి చెబుతున్న ట్రంప్‌ తన‌ ఓటమిని అంగీకరించే దిశగా నెడుతున్నాయి. ఇక గత వారం పెన్సిల్వేనియా రాష్ట్ర న్యాయస్థానంలోనూ ట్రంప్‌కు పెద్ద దెబ్బే తగిలింది. అక్కడ పోలైన కొన్ని వేల ఓట్లు చెల్లవని, అవకతవకలు జరిగాయని తీర్పు ఇవ్వాలంటూ న్యాయమూర్తిని ట్రంప్ తరఫు న్యాయవాది రూడీ గిలియానీ కోరగా ఆయన సీరియస్ అయ్యారు.

అంతేకాదు న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించడంతో.. కోర్టు ముందు తను చేసిన వాదనల్లో.. ఎన్నికల్లో అవకతవలు జరిగాయని స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని, కేవలం సాంకేతిక కారణాలు చూపించి ఓట్లు చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించానని రూడీ స్వయంగా అంగీకరించాల్సి వచ్చింది. అమెరికా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎటువంటి ఉపయోగం ఉండే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది. ట్రంప్‌కు ఉన్న న్యాయపరమైన అవకశాలన్నిటినీ దాదాపుగా వినియోగించుకున్నారని, అవకతవకలు జరిగాయని ఆరోపించట్లేదని వారే స్వయంగా అంగీకరించారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే..ట్రంప్ మాత్రం సుప్రీం కోర్టు గడపతొక్కడం ఖాయమని ఆయన తరఫు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here