సీఎం రాజ‌కీయ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. కార‌ణం ఏంటో తెలుసా..

ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రాజ‌కీయ కార్య‌దర్శి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప రాజ‌కీయ కార్య‌ద‌ర్శి, బంధువు ఎన్.ఆర్. సంతోశ్. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

డొల్లార్ కాలనీలో ఆయన నివాసంలో శుక్రవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే గమనించిన కుటుంబీకులు… ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సంతోశ్ ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడ్డారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒత్తిళ్ల వల్లే ఆయన ఇంతటి పరిస్థితికి ఒడిగట్టారన్నది ఓ వర్గం వాదన. ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తి ఇలా చేయ‌డంపై అంద‌రూ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

అయితే ఈ విష‌యం తెలిసిన వెంట‌నే సీఎం యడియూరప్ప ఆస్పత్రికి చేరుకుని, సంతోశ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారో విష‌యం తెలియ‌ద‌న్నారు. శుక్ర‌వారం ఆయ‌న‌తో దాదాపు 45 నిముషాలు మాట్లాడిన‌ట్లు చెప్పారు. ఆయ‌న మామూలుగానే క‌నిపించిన‌ట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ విష‌యంపై స్పందించారు. ఈ ఘటన సాయంత్రం 7:30గం.ల ప్రాంతంలో జరిగిందన్నారు. గదిలో ఓ పుస్తకంతో ఒంటరిగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపార‌ని పోలీసులు చెప్పారు. అయితే కాసేపటికే గదిలో అపస్మారకంగా పడిపోవడం గమనించారన్నారు. మ‌రి దీనికి సంబంధించిన విష‌యాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here