సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సోనియా గాంధీ…

కాంగ్రెస్ పార్టీ అధినాయ‌కురాలు సోనియా గాంధీ పార్టీల ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల ఓట‌మితో డైల‌మాలో ప‌డిన కాంగ్రెస్ పార్టీలో ఇటీవ‌ల అంత‌ర్గ‌తంగా జ‌రిగిన ర‌చ్చ చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో మొత్తం పార్టీలో మార్పులు చేర్పులు చేస్తూ సోనియా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీల‌క‌మైన వ్య‌క్తుల‌కు ఇచ్చే ప‌ద‌వులు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో ఉంటాయి. ఈ క‌మిటీలో మార్పులు చేస్తూ సోనియా నిర్ణ‌యం తీసుకున్నారు. సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెడుతూ సోనియా క‌మిటీని ప్ర‌క‌టించ‌డం పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి గులాంన‌బీ ఆజాద్‌ను కాంగ్రెస్ తొల‌గించింది. అంబికా సోని, మోతిలాల్ వోరా, మ‌ల్లికార్జున ఖ‌ర్గేల‌ను కూడా తొల‌గించి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పొచ్చు.

మొన్న జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశానికి ముందురోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్లంతా సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీకి పూర్తి స్థాయి అధ్య‌క్షుడు కావాల‌ని వారు లేఖ‌లో ప్ర‌స్తావించారు. దీనిపై స‌మావేశంలో వాడీ వేడీ చ‌ర్చ జ‌రిగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగోలేద‌ని తెలిసిన‌ప్ప‌టికీ ఇలా లేఖ రాయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని రాహుల్ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఒకింత సీనియ‌ర్ల‌పై మండిప‌డ్డారు. బీజేపీతో కుమ్మ‌క్కై ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా అని ప్రశ్నించారు. పార్టీకి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌డం త‌ప్పా అంటూ సీనియ‌ర్లు కూడా వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సీనియ‌ర్ల‌కు చెక్ పెడుతూ సోనియా గాంధీ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. అయితే దీని వ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇక సోనియా నిర్ణ‌యాల్లో పార్టీకి విశ్వాస‌పాత్రుడిగా ఉన్న జైరాం ర‌మేష్‌ను రాజ్య‌స‌భ‌లో చీఫ్ విప్‌గా నియ‌మించారు. దీంతో పాటు సంస్థాగ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌హాయం అందించేందుకు ఆరుగురు నేత‌ల‌తో ఓ క‌మిటీని వేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా ప్రియాంకా గాంధీకి పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఏది ఏమైనా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణ‌యాలు కాంగ్రెస్‌తో పాటు దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయ‌ని చెప్పొచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here