ఏపీ తీరుపై కేసీఆర్ ఫైర్‌..

ఏపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాము రైట్ వే లో వెళ్తున్నా ఏపీ కావాల‌నీ కొర్రీలు వేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నీటి ప్రాజెక్టుల‌పై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విష‌యంలో ఏపీ ఫిర్యాదులు చేయ‌డంపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల‌పై అర్థంప‌ర్థంలేని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తోంద‌న్నారు. అపెక్స్ కౌన్సిల్ స‌మావేశంలో కేంద్రంతోపాటు ఏపీకి బ‌ల‌మైన స‌మాధానం చెప్పాల‌ని కేసీఆర్ అధికారుల‌కు చెప్పారు.

ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను పిలిచి తానే మాట్లాడాన‌న్న కేసీఆర్‌.. రైతుల ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మిద్దామ‌ని చెప్పామ‌న్నారు. కానీ ఏపీ ప్ర‌భుత్వం కెలికి క‌య్యం పెట్టుకుంటోంద‌న్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల‌పై మ‌రోసారి నోరెత్తి మాట్లాడ‌లేని  ప‌రిస్థితిని ఏపీకి క‌ల్పిస్తామ‌ని కేసీఆర్ అన్నారు.

అయితే ఏపీ తెలంగాణ మ‌ధ్య జ‌ల వివాదాలు ప‌రిష్క‌రించేందుకు వెంట‌నే అపెక్స్ కౌన్సిల్ భేటి జ‌ర‌గాల‌ని కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న లేఖ‌లు రాశారు. గోదావ‌రి న‌దిపై తెలంగాణ చేప‌ట్టిన ప్రాజెక్టులు, కృష్ణా న‌దిపై ఏపీ చేప‌ట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు, అందుకు సంబంధించిన కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌వ‌ద్ద‌ని ఆదేశించారు.

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏర్ప‌డిన అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి మాత్ర‌మే జ‌రిగింది. ఈ నెల 20న మ‌రోసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ అవ్వ‌డంపై ఏపీ నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌ని కేంద్ర మంత్రి అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ అజెండా ఇవ్వాల‌ని గ‌తేడాది సెప్టెంబ‌రులో కోరినా ఇరు రాష్ట్రాలు స్పందించ‌లేద‌న్నారు. ఇరు రాష్ట్రాలు స‌రిగ్గా స్పందించ‌క‌పోవ‌డంతో గోదావ‌రి, కృష్ణా బోర్టుల సూచ‌న మేర‌కు మంత్రిత్వ శాఖ నాలుగు అంశాల‌పై చ‌ర్చించాల‌ని ఖ‌రారు చేసింది.

క్రిష్ణా న‌దిపై ఏపీ అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతోంద‌ని తెలంగాణ ఫిర్యాదు చేసింది. శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌ర్ నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల నీటిని వాడుకునేందుకు నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ఇది త‌మ ప్ర‌యోజ‌నాల‌కు హానిక‌ర‌మ‌ని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

ఈ ఏడాది జూన్ 4వ తేదీన కృష్ణా బోర్డు 12వ స‌మావేశంలో ఇరు రాష్ట్రాలు ప‌లు అంశాలపై త‌మ త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశాయి. అంతేకానీ ప‌రిష్కారానికి రాలేక‌పోయామ‌ని కేంద్రం చెబుతోంది. ఏపీ ప్రాజెక్టుల‌కు సంబంధించిన డీపీఆర్‌ను ఇవ్వాల‌ని బోర్డు ఆదేశించినా ఇప్ప‌టివ‌ర‌కు అందించ‌లేద‌న్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ఇటీవ‌ల ఏపీ టెండ‌ర్లు పిలిచింద‌ని అధికారుల ద్వారా తెలిసింద‌ని కేంద్రం పేర్కొంది. దీంతో తెలంగాణ అభ్యంత‌రాల మేర‌కు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌నులు కొన‌సాగించ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం.. కృష్ణా బోర్డు, కేంద్ర జ‌ల సంఘం అనుమ‌తులు లేకుండా నిర్మించ‌డం భావ్యం కాదని కేంద్ర మంత్రి లేఖ‌లో పేర్కొన్నారు.

విభ‌జ‌న చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ ఏపీ కేంద్రానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుల వ‌ల్ల త‌మ ప్ర‌యోజ‌నాల‌కు హాని జ‌రుగుతోంద‌ని ఏపీ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం, గోదావ‌రి ఎత్తిపోత‌ల ప‌థ‌కం 3వ ద‌శ‌, సీతారామ ఎత్తిపోత‌ల, తూపాకుల గూడెం తెలంగాణ తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు, లోయ‌ర్ పెన్ గంగ‌పై బ్యారేజీల నిర్మాణం, రామ‌ప్ప నుంచి పాకాల మ‌ల్లింపు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టానికి విరుధ్ధంగా నిర్మిస్తున్నార‌ని ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఈ ఏడాది మేలో అభ్యంత‌రాలు తెలిపిన‌ట్లు కేంద్ర మంత్రి తెలంగాణ సీఎంకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాలు ఒక‌రికొక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం రోజురోజుకూ వివాదాలు పెరుగుతుండ‌టంతో అపెక్స్ కౌన్సిల్ అత్య‌వ‌స‌రంగా భేటి కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని కేంద్రం పేర్కొంది. దీంతో కేసీఆర్ అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు.  తెలంగాణాకు ఉన్న వాటా ప్రకార‌మే ప్రాజెక్టులు నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే అనుమ‌తులు పొందిన ప్రాజెక్టుల‌పై అభ్యంత‌రాలు స‌రికాద‌న్నారు. శ్రీ‌శైలం నుంచి సాగ‌ర్‌కు నీటి విడుద‌ల‌లో కేంద్రం అభ్యంత‌రం చెబుతోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. వాస్త‌వాలు తెలుసుకోకుండా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం.. రాష్ట్రాల హ‌క్కులు హ‌రించేలా కేంద్రం వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. కేంద్రం వైఖ‌రిని యావ‌త్ దేశానికి తెలిసేలా చేస్తామ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here