సినిమాలకి కమల్ హాసన్ గుడ్ బై .. బీజేపీ లో జేర బోతున్నాడా ?

అతి త్వరలో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నానని ఇప్పటికే ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్, పార్టీ పెట్టిన తరువాత నటించేది లేదని తేల్చి చెప్పేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రాజకీయంగా ముందడుగు వేసిన తరువాత సినిమాల నుంచి విరమించుకుంటానని చెప్పారు. పాలకులు, ప్రజా సంక్షేమం సక్రమంగా సాగడం లేదని, ఆ కోపంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వెల్లడించిన కమల్, ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమని అన్నారు.

 

ప్రజలకు తాను వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ప్రస్తుతానికి ఇంకా వంటపనిలోనే ఉన్నానని, అది పూర్తయిన తరువాత ప్రజలకు రుచికరమైన భోజనం పడతానని చెప్పారు. రాజకీయం అనేది చాలా సుదీర్ఘమైన ఆటని, దానికోసం సినిమాలను పక్కన పెట్టక తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి బీజేపీ పాలన సవ్యంగానే సాగుతోందని, తన ఐడియాలజీ, బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉంటాయా అన్నది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. రాజకీయాల్లో అంటరానివారు ఎవరూ ఉండరని తెలిపారు.

 

పేదలకు దగ్గర కావడమే తన లక్ష్యమని, సంక్షేమం అట్టడుగున్న వ్యక్తికి కూడా అందించాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. ఓటు వేసేందుకు రూ. 5 వేలు తీసుకోవడంతోనే లంచగొండితనం మొదలవుతుందని, ఓటును డబ్బిచ్చి కొనుగోలు చేసే నేత, అభివృద్ధిని గురించి ఆలోచించడన్నది తన అభిప్రాయమని తెలిపారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, చాలా త్వరగా మీడియా తనఅభిప్రాయాలను చెబుతోందని, ఆ విషయం ప్రజలకే వదిలేస్తున్నానని కమల్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here