ప‌శ్చిమ బెంగాల్ వైపు బీజేపీ చూస్తోందా..

దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగ‌రాల‌ని చూస్తున్న ఆ పార్టీ అందుకు త‌గ్గ‌ట్టుగానే క‌స‌ర‌త్తులు చేస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు బీహార్ ఎన్నిక‌ల విష‌యంలో ఫుల్ ఫోక‌స్ పెట్టిన బీజేపీ ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ వైపు దృష్టి పెట్టింది. బీహార్‌లో అధికార పార్టీతో క‌లిసి ముందుకు న‌డిచిన బీజేపీ ఆ పార్టీ కంటే ఎక్కువ‌గానే సీట్లు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బెంగాల్‌లో అధికారం చేప‌ట్టాల‌ని చూస్తోంది.

తాజాగా బీజేపీ నేత‌లు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే బెంగాల్‌పై ఫోక‌స్ ఏ విధంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని బారానగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ టెర్రరిస్టులు, దేశవ్యతిరేకులకు అడ్డాగా పశ్చిమబెంగాల్ మారిందని, కశ్మీర్ కంటే ఇక్కడ పరిస్థితి దిగజారిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు భయంతో బతుకులు గడుపుతున్నారన్నారు. బెంగాల్‌లో లెక్కకు మిక్కిలిగా ఉన్న రోహింగ్యాలు, ఇతర చొరబాటుదారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటేస్తుంటారని ఘోష్ తెలిపారు. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు ఆశ్రయం కల్గిస్తుండటం ఆదోంళన కలిగిస్తోందన్నారు.

పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఏదైనా జరగవచ్చని, పలు రాజకీయ పార్టీలు ఇక్కడకు వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. బీజేపీకి అది పెద్ద విషయం కాదని, ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణాన్ని తమ పార్టీ కల్పిస్తుందని చెప్పారు. బెంగాల్‌లోని 45 శాతం మంది ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారంతా తమను విశ్వసిస్తున్నారని చెప్పారు. టీఎంసీ, సీపీఐ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి పోటీ చేయవచ్చని అన్నారు. అభివృద్ధికి పాటు పడే పార్టీ ఒకవైపు, అశాంతిని సృష్టించే పార్టీలన్నీ మరోవైపు ఉంటాయని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే బీజేపీ వ్యూహం ఇప్పుడు బెంగాల్‌పైనే ఉంద‌ని.. రానున్న ఎన్నిక‌ల‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెడ‌తారని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here