ఆ జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఇంట‌ర్ విద్యార్థిని..

ఓ జిల్లా కలెక్ట‌ర్‌గా ఇంట‌ర్ చ‌దివే విద్యార్థిని ఎంపికైంది. ఇది ఎక్క‌డో కాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లాలో జ‌రిగింది. జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న గంధం చంద్రుడు త‌న బాధ్య‌త‌ల‌ను ఇంట‌ర్ విద్యార్థినికి అప్ప‌గించారు.

అస‌లేమైందంటే.. అంత‌ర్జాతీయ బాలికా దినోత్సవం సంద‌ర్బంగా జిల్లా కలెక్ట‌ర్ గంధం చంద్రుడు ఈ వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. బాలిక భ‌విష్య‌త్తు పేరుతో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండ‌ల త‌హ‌శీల్దార్లు, డిప్యూటీ త‌హ‌శీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్లుగా బాలిక‌ల‌కు బాద్య‌త‌లు అప్ప‌గించారు. వీరు ఒక్క రోజంతా ఈ అధికారులుగా కొన‌సాగుతారు. ఈ మేర‌కు శ‌నివార‌మే క‌లెక్ట‌ర్‌ ఉత్త‌ర్వులు ఇచ్చారు.

ఇందులో భాగంగా జిల్లా క‌లెక్ట‌ర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా.. పక్కనే ఉన్న గంధం చంద్రడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలికే ఉండనున్నారు. అంతేకాకుండా అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వీళ్లు ఏ నిర్ణ‌య‌మైనా తీసుకోవ‌చ్చు. ఏ ఆదేశాలైనా ఇవ్వొచ్చు. వీరి ఆదేశాల‌ను కింది స్థాయి అధికారులు అమ‌లు చేయాలి. త‌నిఖీలు కూడా చేయొచ్చు.

తలుపుల, కొత్త చెరువు, గుత్తి, గార్లదిన్నె తదితర మండలాల్లో ప్రతి కార్యాలయానికి బాలికే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా ఉన్నారు. బాలికా దినోత్స‌వం సంద‌ర్బంగా ప‌లు చోట్ల కేక్ క‌ట్ చేశారు. బాలికా దినోత్స‌వం రోజు వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం ప‌ట్ల అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here