ఇక నుంచి పార్శ‌ల్ స‌ర్వీసులకు కూడా రిజ‌ర్వేష‌న్‌

రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మామూలుగా ప్ర‌యాణీకులు ముంద‌స్తుగా రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే. ఇక ఇప్పుడు స‌రుకు ర‌వాణాలో కూడా ముందుస్తుగా రిజ‌ర్వేష‌న్ ప్ర‌క్రియ‌ను తీసుకొచ్చింది.

క‌రోనా కార‌ణంగా రైల్వే శాఖ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని చెప్పాలి. దేశ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోవడంతో రైల్వే ఆదాయానికి భారీగా గండి ప‌డింది. దీంతో దీన్ని ఎలాగైనా భ‌ర్తీ చేసుకోవాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఇందుకోసం స‌రుకు ర‌వాణ‌పైనే ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రైళ్లు, వ్యాగ‌న్ల ద్వారా స‌రుకు, పార్శిళ్ల ర‌వాణాను ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని తెచ్చింది.

ఈ విధానం ద్వారా వినియోగ‌దారులు ఇక నుంచి 120 రోజుల ముందు నుంచీ స‌రుకును రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌చ్చు. వినియోగదారులు ఏ తేదీకి స‌ర‌కు పంపాలంటే అప్పుడు పంప‌వ‌చ్చు. అయితే అడ్వాన్స్‌డ్ రిజ‌ర్వేష‌న్ కోసం ప‌దిశాతం డ‌బ్బును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. మిగ‌తా డ‌బ్బును రైలు బ‌య‌లుదేరేందుకు మూడు రోజుల ముందు క‌ట్టాల‌ని అధికారులు తెలిపారు.

ఒక వేళ స‌ర‌కు ర‌వాణా చేసే రైళ్లు ర‌ద్ద‌యితే ముందు క‌ట్టిన మొత్తాన్నివెన‌క్కు ఇచ్చేస్తారు. ఇక వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు కూడా ప్ర‌త్యేక రాయితీలు ప్ర‌క‌టించింది. క‌రోనా రాక‌తో ఏర్ప‌డిన ఆదాయ న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు రైల్వేశాఖ‌ దీనిపై దృష్టి పెట్టింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here