సీబీఐ సోదాల‌కు వెళితే క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందట‌..

మొన్న సీబీఐ అధికారులు సోదాల‌కు వెళ్లిన వ్య‌క్తి ఇంట్లో నిన్న క‌రోనా పాజిటివ్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌ర్నాట‌క రాష్ట్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బెంగుళూరు రూర‌ల్ ఎంపీ, డీ.కే సురేష్ కుమార్ ఇంట్లో సోమ‌వారం సీబీఐ అధికారులు సోదాలు చేశారు. కాగా మంగ‌ళ‌వారం సురేష్‌కు కోవిడ్ నిర్ధార‌ణ అయ్యింది.

క‌ర్నాట‌క పీసీసీ అధ్యక్షుడు డీ.కే శివ‌కుమార్‌తో పాటు ఆయ‌న సోద‌రుడు డీ.కే సురేష్ ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు క‌ర్నాట‌క‌తో పాటు, ఢిల్లీ, ముంబైల్లో వీరికి సంబంధించిన కార్యాల‌యాల‌పై ఒకేసారి దాడులు చేశారు. అయితే త‌న‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని సురేష్ కుమార్ ప్ర‌క‌టించారు. త‌న‌ను క‌లిసిన వారంతా క‌రోనా టెస్టు చేయించుకోవాల‌ని చెప్పారు. ప్ర‌ధానంగా త‌న ఇంట్లో సోదాలకు వ‌చ్చిన సీబీఐ అధికారులు, మీడియా, స‌న్నిహితులు, బంధువులు అంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

అయితే త‌న‌కు మాత్రం ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ వైద్యుల సూచ‌న మేర‌కు క్వారంటైన్‌లోకి వెళుతున్న‌ట్లు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు క‌ర‌నా బారిన ప‌డుతున్న విష‌యం త‌ర‌చూ వింటున్నాం. తాజాగా ఈ ఎంపీకి కూడా క‌రోనా సోకింది. ఏది ఎలా ఉన్నా దాడుల్లో పాల్గొన్న సీబీఐ అధికారులు మాత్రం ఇప్పుడు క‌రోనా పరీక్ష‌లు చేయించుకొనేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here