ముఖ్య‌మంత్రి అనుకుంటే గంట‌లోపే ఉద్యోగం వ‌చ్చేసింది..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుకుంటే ఏదైనా అయిపోతుంది. ఓ దివ్యాంగురాలు త‌న‌కు ఉద్యోగం క‌ల్పించి ఆదుకోవాల‌ని కోరిన వెంట‌నే గంటలోపే ఆమెకు ఉద్యోగం క‌ల్పించారు. ఇది తెలుగు రాష్ట్రాల‌లో కాదు త‌మిళ‌నాడులో జ‌రిగింది.

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి తూత్తుకుడి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వ‌చ్చారు. కార్య‌క్ర‌మం ముగించుకొని కలెక్టర్‌ కార్యాలయానికి ఎడప్పాడి వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ దివ్యాంగురాలు వినతిపత్రం పట్టుకుని వుండడం గమనించారు. వెంటనే డ్రైవర్‌ను ఆ దివ్యాంగురాలి వద్ద కారు ఆపి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ త‌న పేరు మారీశ్వరి అని.. తూత్తుకుడి కట్టుయాపురానికి చెందాన‌ని చెబుతూ.. కూలి పనులకు వెళుతున్న భర్త సంపాదనతో కుటుంబాన్ని పోషించలేకున్నానని, తనకు ఐదేళ్ల శాలిని అనే కుమార్తె వుందని, ఈ పరిస్థితుల్లో తనకు ఏదైనా ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని సీఎంను కోరింది. విన‌తిప‌త్రం కూడా ఇచ్చింది.

వెంట‌నే ముఖ్య‌మంత్రి మ‌ట్లాడుతూ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చారు. అయితే సీఎంకు విన‌తిప‌త్రం ఇచ్చాం పని ఎప్పుడు అవుతుందో అనుకున్నారు ఆమె. కానీ క‌లెక్ట‌ర్ ఆఫీసుకు వ‌చ్చి క‌ల‌వాల‌ని సీఎం ఆమెకు చెప్పారు. అనంత‌రం ఆమె క‌లెక్ట‌ర్ కార్యాల‌యంకు వెళ్లి సీఎంను క‌లిశారు. అయితే అంత‌లోపే ఆయ‌న పక్కనే వున్న ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈమెకు స‌రిపోయే ఉద్యోగం క‌ల్పించాల‌ని చెప్పారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో వార్డు సూపర్‌వైజర్‌ పోస్టుకు మారీశ్వరి అన్ని విధాల అర్హురాలని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో వెంట‌నే త‌న‌ను క‌లిసిన మారీశ్వ‌రికి నియామ‌క‌ప‌త్రాన్ని సీఎం అంద‌జేశారు. ముఖ్య‌మంత్రికి విన‌తిప‌త్రం ఇచ్చిన గంట‌లోపే ఉద్యోగం రావ‌డంతో ఆమె సంతోషానికి అవ‌ధులు లేవు. ఆమెకు నెల‌కు 15వేల జీతం ఇవ్వ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here