విశాఖ‌లో జ‌గ‌న్ ఏం చేస్తున్నారో నారా లోకేష్‌కు ఎలా తెలుసు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు కూల్చివేత‌ల చుట్టూ తిరుగుతున్నాయి. టిడిపి నేత‌ల ఇళ్ల‌ను క‌క్ష్య క‌ట్టి కూల్చుతున్నార‌ని త‌మ్ముళ్లు ఆరోపిస్తుంటే.. వైసీపీ మాత్రం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని చెబుతోంది. తాజాగా గీతం యూనివ‌ర్శిటీ వ‌ద్ద కూల్చివేత‌ల‌పై మ‌రోసారి రాజ‌కీయాలు వేడెక్కాయి.

విశాఖ‌లోని గీతం యూనివ‌ర్శిటీకి చెందిన ప‌లు కట్ట‌డాల‌ని ఉద‌యం జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ప్ర‌భుత్వ భూములు ఆక్ర‌మించి వీటిని నిర్మించార‌ని కూల్చివేత‌లు ప్రారంభించారు. యూనివ‌ర్శిటీ ప్ర‌ధాన ధ్వారంతో పాటు ప్ర‌హారీ గోడ‌లో కొంత భాగం, సెక్యూరిటీ రూముల‌ను కూల్చివేశారు. అయితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, నిర్మాణాలు తొలగిస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ కూల్చివేత‌ల‌పై మండిప‌డ్డారు. సీఎం జ‌గ‌న్‌కు విధ్వంసం చేస్తే కిక్ వ‌స్తుంద‌న్నారు. మామూలుగా ముఖ్య‌మంత్రుల‌కు అభివృద్ధి చేసిన‌పుడు కిక్ వ‌స్తే జ‌గ‌న్‌కు విధ్వంసం చేస్తే వ‌స్తుందన్నారు.

గీతం యూనివ‌ర్శిటీ క‌ట్ట‌డాలు కూల్చివేయ‌డం రాజ‌కీయ చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. క‌రోనా స‌మ‌యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గీతం యూనివ‌ర్శిటీ సేవ‌లు అందించింద‌న్నారు. విద్యాబుద్దులు నేర్పి ఎంతో మందిని ఉన్న‌త స్థానాల‌కు చేర్చింద‌ని.. ఇలాంటి యూన‌వ‌ర్శిటీపై విధ్వంసం చేయ‌డమేంట‌న్నారు. గీతం యూనివ‌ర్శిటీకి నోటీసులు ఇవ్వ‌కుండా ఇలా చేశార‌న్నారు. ప‌డ‌గొట్ట‌డం త‌ప్ప నిల‌బెట్ట‌డం జ‌గ‌న్‌కు తెలియ‌ద‌న్నారు. మొన్న స‌బ్బం హ‌రి ఇల్లు, ఇప్పుడు గీతం యూనివ‌ర్శిటీ అని ట్వీట్ చేశారు. విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌న్నారు.

దీనిపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పందిస్తూ ప్రైవేట్ యాజ‌మాన్యాలు ఆక్ర‌మ‌ణ‌లు చేస్తే చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. గీతం యూనివ‌ర్శిటీ ఆక్ర‌మ‌ణ‌లో 40 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉందని.. దీని విలువ రూ. 800 కోట్లు ఉంటుంద‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌పై అధికారులు దాడులు చేస్తే తెలుగుదేశం రాద్దాంతం చేస్తుంద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here