ఏపీ నుంచి ఆ రాష్ట్రానికి భారీగా బంగారం ర‌వాణా..

బంగారం అక్ర‌మ ర‌వాణా ఇటీవ‌ల ఎక్కువ‌గా వినిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం వీరిని ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు బంగారం స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు. కోట్ల రూపాయ‌లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మ‌హారాష్ట్రకు అక్ర‌మంగా బంగారం ర‌వాణా చేస్తున్న ముఠాను ప‌ట్టుకున్న‌ట్లు మ‌హారాష్ట్ర పోలీసులు తెలిపారు. విశాఖ‌ప‌ట్నం నుంచి మ‌హారాష్ట్రలోని సాంగ్లీకి వీరు బంగారాన్ని ర‌వాణా చేస్తున్నారు. అయితే పోలీసుల‌కు ముంద‌స్తు స‌మాచారం ఉంది. అందుకే వీరిని ప‌ట్టుకున్నారు. ఈ వివ‌రాల‌ను సీఐ (సోలాపూర్ గ్రామీణ) తేజస్విని సత్పుట్ చెప్పారు. ముందస్తు సమాచారంతో సోలాపూర్ హైవేపై ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. హైవేపై అనుమానాస్పద వాహనం కనిపించడంతో తమ బృందం తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనిఖీలో భాగంగా నిందితుల దగ్గరి నుంచి ఆరు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు.

తనిఖీల్లో పట్టుబడిన బంగారం విలువ రూ. 3.16 కోట్లు ఉంటుందని తేజస్విని చెప్పారు. నిందితులు బంగారం తమదేనని ఎలాంటి పత్రాలు చూపించలేదని, పైగా వారి సమాధానాలు అనుమానాస్పందంగా ఉండడంతోనే బంగారాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని మరిన్నీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ తేజస్విని సత్పుట్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here