‘మహానటి’కి పుట్టినరోజు శుభాకాంక్షలు..

నటన, అందం కలగలిపిన నటీమణుల్లో కీర్తి సురేష్‌ ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోన్న ఈ బ్యూటీ జన్మించి నేటితో (అక్టోబర్‌ 17) 28 ఏళ్లు పూర్తయ్యాయి. 1992లో చెన్నైలో జన్మించిన కీర్తి సురేష్‌ అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదిచుకుంది. కీర్తి పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు, అభిమానులు కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్‌ నట ప్రస్థానం, ప్రస్తుతం తను చేస్తోన్న ప్రాజెక్టులకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం..

‘పైలట్స్’ అనే మలయాళ చిత్రంతో బాలనటిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది నటి కీర్తి సురేష్‌. అనంతరం పలు చిత్రాల్లో బాలనటిగా నటించి 2013లో వచ్చిన గీతాంజలి (మలయాళం) చిత్రంతో హీరోయన్‌గా పరిచయమైంది. ఇక 2016లో వచ్చిన ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. ఈ సినిమాలో తనదైన క్యూట్‌ నటనతో తొలి చిత్రంతోనే మంచి పేరు సంపాదిచుకుంది. ఇక ‘నేను లోకల్‌’లో నానితో ఆడిపాడిన ఈ చిన్నది తర్వాత ‘అజ్ఞాతవాసి’తో పవర్‌స్టార్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

2017లో వచ్చిన ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా యావత్‌ భారతీయ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ అందాల తార. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

 ‘సర్కారు వారి పాట’లో కీర్తి..

మహేష్‌ బాబు హీరోగా నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌ ఎవరనే సస్పెన్స్‌కు తెర పడింది. ఈ చిత్రంలో మహేష్‌ సరసన కీర్తి సురేష్‌ నటించనుంది. ఈ విషయాన్ని మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా పంచుకున్నాడు. కీర్తి సురేష్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన మహేష్‌.. ‘సూప‌ర్ టాలెంటెడ్‌ కీర్తికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. నిన్ను సర్కారు వారి పాటలోకి టీమ్ ఆహ్వానిస్తోంది. నీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది అని నేను భావిస్తున్నాను అని  మహేష్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కీర్తి సురేష్‌.. ‘థ్యాంక్యూ సో మ‌చ్ మ‌హేష్ బాబు స‌ర్.. మొదటిసారి మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది .ఆ క్ష‌ణం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపింది.

కీర్తి సురేష్‌ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని జాతీయ అవార్డులను గెలుచుకోవాలని కోరుకుంటూ.. ‘తెలుగు సీఎమ్‌.కామ్‌’ తరఫున కీర్తి సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here